ENG Vs PAK: ఇంగ్లండ్‌ జట్టులో కలకలం.. 15 మందికి గుర్తుతెలియని వైరస్‌

ENG-Cricketers Includes Stokes Infected Unidentified Virus Ahead-1st Test - Sakshi

17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ ఆడేందుకు వచ్చిన ఇంగ్లండ్‌ జట్టుకు సిరీస్‌ ప్రారంభానికి ముందే ఊహించని షాక్‌ తగిలింది. జట్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ సహా 14 మంది ఇంగ్లండ్‌ ఆటగాళ్లకు గుర్తుతెలియని వైరస్‌ సోకడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హరీ బ్రూక్, జాక్ క్రాలీ, కీటన్ జెన్నింగ్స్, ఓలీ పోప్, జోరూట్ మినహా ఆటగాళ్లు వైరస్‌ బారిన పడ్డట్లు తెలుస్తోంది. దీంతో డిసెంబర్‌ 1 నుంచి రావల్పిండి వేదికగా జరగాల్సిన తొలి టెస్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. 

అయితే ఇప్పటివరకు పీసీబీ.. ఈసీబీలు మ్యాచ్‌ నిర్వహణపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే జట్టులో 15 మంది తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో కనీసం 11 మంది కూడా ఆడడానికి సిద్ధంగా లేరు. ఒకవేళ​ ఆటగాళ్లకు సోకిన వైరస్‌ కరోనా కంటే ప్రమాదకరమని తెలిస్తే మాత్రం సిరీస్‌ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆటగాళ్ల రిపోర్ట్స్‌ వచ్చాకా అసలు విషయం బయటపడుతుంది. అయితే ఇంగ్లండ్‌ జట్టుకు సోకిన వైరస్‌కు కోవిడ్‌-19తో ఎలాంటి సంబంధం లేదని.. తీవ్రమైన కడుపు నొప్పితో మాత్రం బాధపడుతున్నట్లు తేలిందని వైద్యులు పేర్కొన్నారు.

కాగా పాక్‌తో టెస్టు సిరీస్‌ ఆడేందుకు వచ్చిన స్టోక్స్‌ సారధ్యంలోని ఇంగ్లండ్‌ జట్టు తమ వెంట మాస్టర్‌ చెఫ్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కాగా టి20 ప్రపంచకప్‌కు ముందు టి20 సిరీస్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌ పాకిస్తాన్‌కు వచ్చింది. ఆ సిరీస్‌లో ఆహారం వల్ల కొంతమంది ఇంగ్లండ్‌ ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈసారి అలా జరగకూడదని తమ వెంట మాస్టర్‌ చెఫ్‌ను వెంటబెట్టుకొని వచ్చినట్లు ఈసీబీ పేర్కొంది. 

సుమారు 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్‌ ఆడేందుకు ఇంగ్లండ్ పాకిస్థాన్‌ గడ్డపై అడుగుపెట్టింది. టి20 వరల్డ్‌ కప్‌ 2022కు ముందు పాకిస్థాన్‌ వెళ్లి 7 టీ20ల సిరీస్‌ను 4-3తో గెలిచి వచ్చిన ఇంగ్లండ్‌.. వరల్డ్‌ కప్‌ తర్వాత మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు మళ్లీ పాక్‌కు వెళ్లింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్‌ 1 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుండగా.. రావల్పిండి వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. అలాగే రెండో టెస్టు డిసెంబర్‌ 9 నుంచి ముల్తాన్‌లో, మూడో టెస్టు డిసెంబర్‌ 17 నుంచి కరాచీలో జరగనున్నాయి. ఇక 2005లో పాక్‌లో పర్యటించిన ఇంగ్లండ్‌ జట్టులో ఒక అండర్సన్‌ మాత్రమే ప్రస్తుతం జట్టులో కొనసాగుతున్నాడు.

చదవండి: జడ్డూ నువ్వు రాజకీయాలు చూసుకో! ఇక నీ అవసరం ఉండకపోవచ్చు!

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top