ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. జట్టు నిండా స్టార్లు ఉన్నా, మ్యాచ్‌ను గెలిపించే నాథుడు ఒక్కడు కూడా లేడు. ఈ సీజన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఏకంగా 5 పరాజయాలు ఎదుర్కొంది. కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది.
తాజాగా (ఏప్రిల్ 22) రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసి ప్రత్యర్దిని 159 పరుగులకే కట్టడి చేసినప్పటికీ.. ఆపాటి లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిలపడింది. బౌలింగ్‌లో షమీ (4-0-30-2), ప్రిన్స్ యాదవ్ (4-0-29-2), మొహిసిన్ (4-1-17-2) రాణించారు. రాయల్స్ తరఫున బ్యాటింగ్‌లో రవీంద్ర జడేజా (43 నాటౌట్) రాణించాడు.
అనంతరం స్వల్ప ఛేదనలో లక్నో ఆదిలోనే చేతులెత్తేసింది. ఆర్చర్ (4-1-20-3), బర్గర్ (4-0-27-2), బ్రిజేష్ శర్మ (3-0-18-2), జడేజా (4-0-29-1), బిష్ణోయ్ (3-0-23-1) ధాటికి 18 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ మార్ష్ (55) ఒంటరిపోరాటంతో లక్నోను గెలిపించే ప్రయత్నం చేశాడు. ఇతను మినహా టాప్-4లో మిగతా ముగ్గురు (బదోని, పంత్, మార్క్రమ్) డకౌటయ్యారు.
డక్ మాస్టర్
ఈ సీజన్‌లో పంత్ వైఫల్యాల పరంపర కొనసాగింది. రాయల్స్ మ్యాచ్‌లో అతను 3 బంతులు ఆడి బర్గర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ డక్‌తో పంత్ ఓ చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డకౌట్లైన వికెట్‌కీపర్ బ్యాటర్ల జాబితాలో ధోనిని (6) దాటాడు. 7 డక్‌లతో గిల్‌క్రిస్ట్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. డక్ మాస్టర్ల జాబితాలో దినేశ్ కార్తీక్ (16), పార్థివ్ పటేల్ (10), నమన్ ఓఝా (8) టాప్-3లో ఉన్నారు.


