#MS Dhoni: 15 ఏళ్లుగా ఆడుతూనే ఉన్నాడు.. అయినా ప్రతిసారీ ధోని గురించే ఎందుకు? జీవితాంతం: టీమిండియా దిగ్గజం

Do We Want Him To Play All His Life Kapil Dev Blunt Statement On Dhoni IPL future - Sakshi

IPL 2023- MS Dhoni: ‘‘ఇప్పటికే అతడు పదిహేనళ్లపాటు ఐపీఎల్‌ ఆడాడు. అయినా.. మనం ప్రతిసారి ధోని గురించే ఎందుకు మాట్లాడాలి? ధోని తన పని తాను చేశాడు. ఇంకా మనం తన నుంచి ఆశించడానికి ఏం మిగిలి ఉంది? జీవితాంతం అతడు ఐపీఎల్‌ ఆడుతూనే ఉండాలా?’’ అని టీమిండియా దిగ్గజం కపిల్‌ దేవ్‌ అసహనం వ్యక్తం చేశాడు. 

కాగా టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్‌ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్‌కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన మిస్టర్‌ కూల్‌.. ఐపీఎల్‌లో సీఎస్‌కేను నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిపాడు.

తలా ఒక్క షాట్‌ ఆడినా చాలు
ఇక ఐపీఎల్‌-2023 ధోనికి చివరి సీజన్‌ అన్న వార్తల నేపథ్యంలో ఆరంభ మ్యాచ్‌ నుంచే ఎక్కడ చూసినా తలా మేనియా కొనసాగుతోంది. ప్రత్యర్థి జట్ల సొంత మైదానంలోనూ ప్రేక్షకులు ధోనికి మద్దతుగా నిలవడం చూశాం. ధోని ఒక్క షాట్‌ ఆడినా చాలు.. ప్రత్యక్షంగా చూడాలంటూ కేవలం తలా కోసమే మైదానానికి పోటెత్తిన ఫ్యాన్స్‌కు లెక్కేలేదు.

తన అద్భుతమైన వ్యూహాలతో అంచనాలు లేని జట్టును ఐపీఎల్‌-2023 ఫైనల్‌కు తీసుకువచ్చిన 41 ఏళ్ల ధోని రిటైర్మెంట్‌ గురించి క్రీడా వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కపిల్‌ దేవ్‌కు సైతం ఈ విషయం గురించి ప్రశ్న ఎదురుకాగా అతడు ఒకింత అసహనం వ్యక్తం చేశాడు.

జీవితాంతం ఆడలేడు కదా!
‘‘ధోని ఇప్పటికే ఐపీఎల్‌లో చేయాల్సిందంతా చేశాడు. తను జీవితాంతం ఆడుతూ ఉండలేడు కదా! అది ఎప్పటికీ జరగని పని. తను ఆడుతూ ఉండాలని కోరుకోవడం కంటే కూడా.. ఈ 15 ఏళ్లలో అతడు క్రికెట్‌కు చేసిన సేవలకు కృతజ్ఞతా భావం చాటుకోవడం అత్యంత ముఖ్యం.

కెప్టెన్‌ ఎలా ఉండాలో చూపించాడు
వచ్చే సీజన్‌లో ధోని ఆడతాడా లేడా అన్న విషయం చెప్పలేం. నిజానికి ఈ ఏడాది ధోని భారీగా పరుగులు రాబట్టలేకపోయినా.. జట్టును ఫైనల్‌కు చేర్చి.. కెప్టెన్‌ మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. క్రికెట్‌లో నాయకుడి పాత్ర ఏమిటో చాటిచెప్పాడు’’ అని కపిల్‌ దేవ్‌ ఏబీపీ న్యూస్‌తో వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్‌-2023లో చెన్నై- గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.

వర్షం కారణంగా..
ఈ క్రమంలో ఆదివారం (మే 28) మ్యాచ్‌ జరగాల్సి ఉండగా వర్షం అడ్డంకిగా మారింది. వరుణుడు కరుణించకపోవడంతో ఫైనల్‌ మ్యాచ్‌ను రిజర్వ్‌ డేకు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సోమవారం చెన్నై- గుజరాత్‌ టైటిల్‌ పోరులో తలపడనున్నాయి. ఒకవేళ ఈరోజు కూడా వర్షం కొనసాగి.. మ్యాచ్‌ రద్దయితే.. టేబుల్‌ టాపర్‌గా ఉన్న హార్దిక్‌ పాండ్యా సేన (గుజరాత్‌) చాంపియన్‌గా అవతరిస్తుంది.

చదవండి: ఐపీఎల్‌ ఫైనల్‌.. స్టేడియం వద్ద వాతావారణం ఎలా ఉందంటే?
రోహిత్‌ శర్మతో కలిసి లండన్‌కు యశస్వి.. తిలక్‌ వర్మ రియాక్షన్‌.. వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top