
న్యూఢిల్లీ: భారత జట్టు ఫార్వర్డ్ దీపిక ‘పాలీగ్రాస్ మ్యాజిక్ స్కిల్’ అంతర్జాతీయ హాకీ అవార్డును సొంతం చేసుకుంది. మైదానంలో అసాధారణ నైపుణ్యంతో ప్రత్యర్థి డిఫెండర్లను, గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించి చేసే గోల్‌కు గుర్తింపుగా ఈ అవార్డును యేటా అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ఇస్తుంది. 2024–25 ప్రొ లీగ్ సీజన్ సందర్భంగా ప్రపంచ నంబర్‌వన్ నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంతో నేర్పుగా దీపిక చేసిన ఫీల్డ్ గోల్‌ను ఎఫ్‌ఐహెచ్ జ్యూరీ, అభిమానులు ఓటింగ్‌లో ‘బెస్ట్ గోల్’గా ఎంపిక చేశారు.
‘ఈ అవార్డు దక్కడం గౌరవంగా భావిస్తున్నా. నెదర్లాండ్స్ లాంటి జట్టుపై ఆ గోల్ చేయడం ప్రత్యేక క్షణం. దానికి ఈ విధంగా గుర్తింపు దక్కడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికప్పుడు స్ఫూర్తి నింపుతున్న సహచరులు, కోచ్‌లు, కుటుంబ సభ్యులు, సన్నిహితులకు ధన్యవాదాలు. ఈ పురస్కారం నా ఒక్కదానిది కాదు. ఇది మొత్తం భారత జట్టుది’ అని దీపిక వెల్లడించింది.