CWG 2022: సఫారీ బౌలర్ల విజృంభణ.. 46 పరుగలకే కుప్పకూలిన శ్రీలంక

CWG 2022: South Africa Thrash Sri Lanka By 10 Wickets - Sakshi

కామన్‌వెల్త్‌ క్రీడల్లో శ్రీలంక మహిళా క్రికెట్‌ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. గ్రూప్‌-బిలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు కేవలం 46 పరుగులకే ఆలౌటై (17.1 ఓవర్లు) చెత్త రికార్డు మూటగట్టుకుంది. టీ20ల్లో శ్రీలంకకు ఇదే అత్యల్ప స్కోర్‌. లంక ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్కరు (కెప్టెన్‌ చమారీ ఆటపట్టు (15)) రెండంకెల స్కోర్‌ సాధించగలిగారంటే వారి బ్యాటింగ్‌ ఎంత చెత్తగా సాగిందో అర్ధమవుతుంది. 

సఫారీ బౌలర్లు మూకుమ్మడిగా దండెత్తి లంక ఇన్నింగ్స్‌ను కకావికలం చేశారు. డి క్లెర్క్‌ (3/7), క్లాస్‌ (2/7), టైరాన్‌ (1/1), మ్లాబా (1/4), షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ (1/12) లు వీర లెవెల్లో రెచ్చిపోయి లంకేయులను మట్టుబెట్టారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన సఫారీలు కేవలం 6.1 ఓవర్లలోనే వికెట్‌ నష్టాపోకుండా లక్ష్యాన్ని చేరుకున్నారు. ఓపెనర్లు అన్నెకె బోష్‌ (16 బంతుల్లో 20 నాటౌట్‌; 2 ఫోర్లు), తజ్మిన్‌ బ్రిట్స్‌ (21 బంతుల్లో 21; 3 ఫోర్లు) జట్టును విజయతీరాలకు చేర్చారు. 

గ్రూప్‌ బిలో ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో పరాజయంపాలైన శ్రీలంక.. ఈ మ్యాచ్‌లో ఓటమితో నాకౌట్‌ రేసు నుంచి నిష్క్రమించగా.. లంకపై ఘన విజయం సాధించినప్పటికీ దక్షిణాఫ్రికా జట్టు కూడా నాకౌట్‌ పోరుకు అర్హత సాధించలేకపోయింది. సఫారీలు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయంతో 2 పాయింట్లు సాధించి గ్రూప్‌ బిలో మూడో స్థానంలో నిలిచారు. ఈ గ్రూప్‌ నుంచి న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ నాకౌట్‌కు అర్హత సాధించగా.. గ్రూప్‌ ఏ నుంచి భారత్‌, ఆస్ట్రేలియాలు ఫైనల్‌ 4కు చేరాయి. 
చదవండి: CWG 2022: బార్బడోస్‌పై ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top