భారత ప్రేక్షకులపై పీసీబీ ఫిర్యాదు.. బాబర్‌, రిజ్వాన్‌లను వేధించారని ఆరోపణలు | Sakshi
Sakshi News home page

CWC 2023: టీమిండియాతో మ్యాచ్‌ సందర్భంగా మా జట్టును వేధించారు: పీసీబీ ఫిర్యాదు

Published Wed, Oct 18 2023 11:29 AM

CWC 2023: PCB File Complaint Over Inappropriate Conduct Targeted At Pakistan Squad During IND VS PAK Match - Sakshi

ఈ నెల 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా పలువురు భారత అభిమానులు తమ జట్టును వేధింపులకు గురి చేశారని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఐసీసీకి ఫిర్యాదు చేసింది. టాస్ సమయంలో కెప్టెన్ బాబర్ ఆజమ్‌ బ్రాడ్‌కాస్టర్ రవిశాస్త్రితో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడు మైదానంలోని ప్రేక్షకులు బిగ్గరగా అరుస్తూ, తమ జట్టు పట్ల అనుచితంగా ప్రవర్తించారని పీసీబీ ఆరోపించింది. మహ్మద్ రిజ్వాన్ ఔటై డ్రెస్సింగ్ రూమ్‌కు  వెళ్తుండగా పలువురు అభిమానులు 'జై శ్రీరాం' నినాదాలు చేసి అతన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని పీసీబీ తమ ఫిర్యాదులో పేర్కొంది.

అలాగే తమ జర్నలిస్టులకు వీసాల జాప్యం, భారత్‌లో ప్రవేశించకుండా (వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు చూసేందుకు) తమ అభిమానులపై అంక్షలు వంటి పలు అంశాలను కూడా పీసీబీ తమ ఫిర్యాదులో ప్రస్తావించింది. ఈ విషయాలను పీసీబీ తమ అధికారిక సోషల్‌మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది. కాగా, పీసీబీ కొద్దిరోజుల కిందట కూడా ఇదే అంశాలపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. 

ఇదిలా ఉంటే, వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ను 191 పరుగులకు కట్టడి చేసిన భారత్‌.. ఆతర్వాత సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించి, ప్రపంచకప్‌లో వరుసగా ఎనిమిదో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించగా.. బ్యాటింగ్‌లో రోహిత్‌ శర్మ (86), శ్రేయస్‌ అయ్యర్‌ (53 నాటౌట్‌) చెలరేగారు. 

ప్రస్తుత ఎడిషన్‌లో భారత్‌ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో మూడింట విజయాలు సాధించగా.. పాక్‌ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించింది. భారత్‌ రేపు (అక్టోబర్‌ 19) జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడాల్సి ఉండగా.. పాక్‌.. అక్టోబర్‌ 20న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.

Advertisement
 
Advertisement