
యూపీ టీ20 లీగ్‌లో టీమిండియా యువ బౌలర్, కేకేఆర్ మాజీ మీడియం పేసర్ శివమ్ మావి విధ్వంసం సృష్టించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి మెరుపులు మెరిపించాడు. ఈ లీగ్‌లో కాశీ రుద్రాస్‌కు ఆడుతున్న మావి.. గోరఖ్‌పూర్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఇందులో 6 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 21 బంతులు ఎదుర్కొన్న మావి 54 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఎనిమిదో వికెట్‌కు మావి శివ సింగ్‌తో (17 బంతుల్లో 34 నాటౌట్; 4 సిక్సర్లు) కలిసి 87 పరుగులు జోడించాడు. మావి, శివ సింగ్ ఇన్నింగ్స్ చివర్లో సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడటంతో రుద్రాస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఈ జట్టు తరఫున కెప్టెన్ కరణ్ శర్మ (39), యశోవర్దన్ సింగ్ (23) కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. గోరఖ్‌పూర్ బౌలర్లలో అబ్దుల్ రెహ్మాన్ 3, శివమ్ శర్మ 2, ప్రిన్స్ యాదవ్, వాసు వట్స్, విజయ్ యాదవ్ తలో వికెట్ తీశాడు.
అనంతరం మావి బౌలింగ్‌లోనూ రాణించాడు. 3.1 ఓవర్లలో 24 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. మావి ఆల్‌రౌండ్ షోతో చెలరేగడంతో రుద్రాస్ గోరఖ్‌పూర్ జట్టుపై 50 పరుగుల తేడాతో గెలుపొందింది. మావితో పాటు అటల్ బిహారీ రాయ్ (4-0-13-3), కార్తీక్ యాదవ్ (3-0-14-2), సునీల్ కుమార్ (3-0-25-1) కూడా సత్తా చాటడంతో గోరఖ్‌పూర్ జట్టు 19.1 ఓవర్లలో 126 పరుగులకే టపా కట్టేసింది. గోరఖ్‌పూర్ తరఫున ప్రిన్స్ యాదవ్ (29 బంతుల్లో 49; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ ఆకాశ్‌దీప్ నాథ్ (34) పోరాటం చేశారు. అయితే అప్పటికే ఆ జట్టు ఓటమి ఖరారైపోయింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసిన మావికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
26 ఏళ్ల మావిని 2018 ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్ రూ. 3 కోట్ల రికార్డు ధర చెల్లించి సొంతం చేసుకుంది. మావి కేకేఆర్ తరఫున 32 మ్యాచ్‌లు ఆడి 30 వికెట్లు తీశాడు. అనంతరం 2024 సీజన్ మెగా వేలంలో మావిని లక్నో సూపర్ జెయింట్స్ ఊహించని ధర (రూ. 6.4 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్ ప్రారంభానికి ముందే అతను పక్కటెముకల గాయంతో వైదొలిగాడు.
ఐపీఎల్ ప్రదర్శనల కారణంగా మావికి 2023లో టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. అరంగేట్రం టీ20లోనే అతను 4 వికెట్ల ప్రదర్శనతో చెలరేగి సత్తా చాటాడు. అయితే ఆతర్వాత మ్యాచ్‌ల్లో రాణించలేకపోవడంతో మావి అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు 6 మ్యాచ్‌లతోనే బ్రేక్ పడింది.