CWC 2023 IND VS PAK: చరిత్రలో తొలిసారి.. | CWC 2023 IND Vs PAK: Gambhir Says For The First Time In History, Indian Pace Bowling Is Better Than Pakistan - Sakshi
Sakshi News home page

CWC 2023 IND Vs PAK: చరిత్రలో తొలిసారి..

Oct 14 2023 10:34 AM | Updated on Oct 14 2023 11:11 AM

CWC 2023: Gambhir Says For The First Time In History, Indian Pace Bowling Is Better Than Pakistan - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్‌ 14) భారత్‌-పాకిస్తాన్‌ జట్లు తలపడనున్నాయి. యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఈ మ్యాచ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ హైఓల్టేజీ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. గెలుపు కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడే అవకాశం ఉన్నప్పటికీ హాట్‌ ఫేవరెట్‌ మాత్రం టీమిండియానేనని చెప్పాలి.

చరిత్ర చూసినా, ఇటీవలి ఫామ్‌ను పరిగణలోకి తీసుకున్నా భారత్‌కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. రోహిత్‌ శర్మ నేతృత్వంలో టీమిండియా పాక్‌తో పోలిస్తే అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇరు జట్లు చెరి రెండు మ్యాచ్‌లు గెలిచినప్పటికీ పాక్‌ కంటే భారతే మెరుగైన విజయాలు సాధించింది. 

టీమిండియాదే విజయం.. బల్ల గుద్ది చెబుతున్న మాజీలు, విశ్లేషకులు
పాక్‌తో ఇవాళ జరిగే మ్యాచ్‌లో టీమిండియాదే విజయమని మెజార్టీ శాతం విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. భారత ఆటగాళ్లు భీకర ఫామ్‌లో ఉండటం, సొంత ప్రేక్షకుల మధ్య మ్యాచ్‌ జరుగుతుండటంతో ఫలితం​ భారత్‌కే అనుకూలంగా వస్తుందని వారు అంచనా వేస్తున్నారు. భారతదే విజయమని పాక్‌ మాజీలు సైతం స్టేట్‌మెంట్స్‌ ఇస్తున్నారు. 

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా..
భారత బౌలింగ్‌ విభాగంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా పేస్‌ విభాగం గతంలో ఎన్నడూ లేని విధంగా భీకరంగా ఉందని కితాబునిచ్చాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో బుమ్రా అత్యంత ప్రమాదకర బౌలర్‌ అని కొనియాడాడు. పాక్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిదికి బుమ్రాకు చాలా వ్యత్యాసముందని అన్నాడు. అఫ్రిది కేవలం ఆరంభ ఓవర్లలో మాత్రమే ప్రభావం చూపగలడని, బుమ్రా ఏ దశలో అయినా మ్యాచ్‌ను మలుపు తిప్పగలడని అభిప్రాయపడ్డాడు.

బుమ్రా అరుదైన టాలెంట్‌ ఉన్న బౌలర్‌ అని ప్రశంసించాడు. భారత పేస్‌ విభాగానికి బుమ్రా వెన్నెముక అయితే షమీ, సిరాజ్‌లు ప్రధాన అస్త్రాలని అన్నాడు. పాక్‌ పేస్‌ త్రయం షాహీన్‌ అఫ్రిది, హరీస్‌ రౌఫ్‌, హసన్‌ అలీ కంటే భారత పేస్‌ త్రయం పటిష్టంగా ఉందని కొనియాడాడు. పాక్‌తో మ్యాచ్‌లో భారత పేసర్లు​ చెలరేగడం ఖాయమని జోస్యం చెప్పాడు. పాక్‌ పేసర్లకు భారతలో ఆడిన అనుభవం తక్కువగా ఉండటం వారికి ప్రతికూలంగా మారుతుందని అభిప్రాయపడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement