
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టాప్ ఎండ్ టీ20 టోర్నీలో పాకిస్తాన్ షాహీన్స్ ఆటగాడు అబ్దుల్ సమద్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. మెల్బోర్న్ రెనెగేడ్స్ అకాడమీతో ఇవాళ (ఆగస్ట్ 18) జరిగిన మ్యాచ్లో 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 110 పరుగులు చేశాడు.
ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు యాసిర్ ఖాన్, ఖ్వాజా నఫే డకౌట్లు కాగా.. అబ్దుల్ సమద్ ఒంటిచేత్తో ఇన్నింగ్స్ను నిర్మించాడు. అతనికి మొహమ్మద్ ఫైక్ (23), కెప్టెన్ ఇర్ఫాన్ ఖాన్ (21) సహకరించారు. మెల్బోర్న్ బౌలర్లలో ఫెర్గస్ ఓనీల్, సదర్ల్యాండ్, మైఖేల్ ఆర్చర్, కల్లమ్ స్టో, ఒలివర్ పీక్ తలో వికెట్ తీశారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన మెల్బోర్న్.. మాజ్ సదాకత్ (4-0-22-3), ఫసల్ అక్రమ్ (4-0-19-2) ధాటికి 19.2 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. తద్వారా పాక్ షాహీన్స్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మెల్బోర్న్ ఇన్నింగ్స్లో జోష్ బ్రౌన్ (36) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు.
కాగా, 11 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఆస్ట్రేలియా లోకల్ జట్లతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్కు చెందిన జట్లు పోటీపడుతున్నాయి. ఈ టోర్నీలో పాక్కు చెందిన షాహీన్స్ జట్టు 3 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. నార్త్రన్ టెరిటరీ స్ట్రయిక్ అనే జట్టు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించి అగ్రస్థానంలో ఉంది.