
టీమిండియా త్వరలో ఆసియాకప్ టి20 సిరీస్ ఆడనుంది. మంగళవారం నాడు జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించే అవకాశం ఉంది. టెస్ట్ జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను ఎంపిక చేస్తారా, లేదా అనే చర్చ జరుగుతోంది. ఇదిలావుంచితే నాయకత్వంపై కూడా డిస్కషన్ నడుస్తోంది. టి20 టీమ్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఉన్నాడు కదా, ఇంక డిస్కషన్ ఏముంది అంటారా? దీని గురించి కాదు. మూడు ఫార్మాట్లకు ఒకరే కెప్టెన్‌గా ఉండాలనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (Virat Kohli) టెస్టులకు గుడ్ బై చెప్పినప్పుడు జట్టు పగ్గాలు ఎవరికి ఇవ్వాలనే దానిపై పెద్ద కసరత్తే జరిగింది. బుమ్రా కెప్టెన్సీ నిరాకరించడంతో కేఎల్ రాహుల్ టెస్ట్ టీమ్ సారథి అవుతాడని చాలా మంది అనుకున్నారు. అనూహ్యంగా సెలక్షన్ కమిటీ శుబ్‌మన్ గిల్‌వైపు మొగ్గు చూపింది. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని యువ నాయకత్వానికే బీసీసీఐ ఓటు వేసింది. కెప్టెన్ హోదాలో ఇంగ్లీషు గడ్డపై లాంగ్ ఫార్మాట్ ఆడిన గిల్.. అంచనాలకు మించి ఆడడంతో అతడిపై భ్రమలు తొలగిపోయాయి. అందరి కంటే ఎక్కువ పరుగులు సాధించడంతో పాటు సిరీస్‌ను సమం చేయడంతో గిల్ నాయకత్వ పటిమపై భారత్ క్రికెట్ అభిమానులకు నమ్మకం కుదిరింది.
రోహిత్ తర్వాత అతడికే..
ఇక ఇప్పుడు మూడు ఫార్మాట్లకు ఒక్కరే కెప్టెన్ ఉంటే బాగుంటుందన్న చర్చ మొదలైంది. ప్రస్తుతం వన్డే జట్టుకు రోహిత్ శర్మ, టీ20 టీమ్‌కు సూర్యకుమార్ యాదవ్, టెస్ట్ జట్టు కెప్టెన్‌గా గిల్ ఉన్నారు. రోహిత్‌కు వయసు మీద పడుతుడడంతో అతడు ఎంతకాలం కెప్టెన్‌గా కొనసాగుతాడన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 2027లో సౌతాఫ్రికాలో జరిగే వన్డే వరల్డ్ కప్ నాటికి హిట్‌మాన్‌కు 40 ఏళ్లు నిండుతాయి. అప్పటి వరకు జట్టులో ప్లేయర్‌గా మాత్రమే కొనసాగుతాడని కొంతమంది నమ్ముతున్నారు. దీంతో గిల్‌కు వన్డే జట్టు పగ్గాలు అప్పగించే చాన్స్ ఉందని విశ్లేషకులు గట్టిగా నమ్ముతున్నారు. వన్డేల్లో గిల్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి రోహిత్ తర్వాత కెప్టెన్సీ చాన్స్ అతడికేనని విశ్లేషిస్తున్నారు.
స్కై డిప్యూటీగా గిల్?
టి20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ స్పోర్ట్స్ హెర్నియా ఆపరేషన్ నుంచి కోలుకుని ఆసియా కప్ (Asia Cup 2025) ఆడేందుకు రెడీ అవుతున్నాడు. అతడికి డిప్యూటీగా అక్షర్ పటేల్ వ్యవహరిస్తున్నాడు. జట్టు సుదీర్ఘ ప్రయోజనాలను లెక్కలోకి తీసుకుని అక్షర్‌ను టి20 టీమ్ వైస్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. గిల్‌ను సూర్యకుమార్‌కు డిప్యూటీగా నియమించి మూడు ఫార్మాట్ల నాయకత్వ బాధ్యతలు మోసేలా తీర్చిదిద్దాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది టి20 వరల్డ్‌కప్ నాటికి మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా గిల్‌ను నియమించేలా కసరత్తు జరుగుతోందని టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది.
మూడింటికి ఒక్కరే బెస్ట్
గత ఫలితాలు చూసుకుంటే మూడు ఫార్మాట్లకు కెప్టెన్ ఒక్కరే ఉన్నప్పుడు టీమిండియా మంచి ఫలితాలు సాధించింది. ఎంఎస్ ధోని పొట్టి ఫార్మాట్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు 2007లో మన జట్టు టి20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. 2011లో అతడిని మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ అప్పగించడంతో.. అదే ఏడాది టీమిండియా వన్డే వరల్డ్‌కప్ గెలిచింది. ధోని నాయకత్వంలోనే 2013లో ఇంగ్లీషు గడ్డపై చాంపియన్స్ ట్రోఫీ సొంతం చేసుకుంది. మూడు ఫార్మాట్లలోనూ రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నప్పుడే 2024లో రెండోసారి టి20 ప్రపంచకప్ విజేత కాగలిగింది. 2015- 17 మధ్య కాలంలో టీమిండియాకు ఇద్దరు నాయకత్వం వహించారు. పొట్టి ఫార్మాట్‌కు ధోని, టెస్టులకు కోహ్లి సారథులుగా ఉన్నారు.
సేమ్ సిట్యుయేషన్
ధోని నుంచి కోహ్లికి వన్డే కెప్టెన్సీ బదలాయింపు సులువుగానే జరిగిందని టైమ్స్ ఆఫ్ ఇండియాతో నేషనల్ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ చెప్పారు. 'అప్పటికే టెస్టు కెప్టెన్‌గా కోహ్లి దూసుకుపోతున్నాడు. వన్డేల్లోనూ బాగా ఆడుతున్నాడు. అదే సమయంలో ధోని.. రిటైర్మెంట్‌కు ముందు కొద్ది రోజులు ఎటువంటి బాధ్యతలు లేకుండా క్రికెట్ ఆడాలని భావించాడు. దీంతో ఎటువంటి ఆటంకాలు లేకుండా ధోని నుంచి కోహ్లికి నాయకత్వ బాధ్యతల బదలాయింపు జరిగింది. ఇప్పుడు గిల్‌కు కూడా అలాంటి పరిస్థితి ఉంద'ని దేవాంగ్ గాంధీ అభిప్రాయపడ్డారు. సుదీర్ఘకాలం భారత క్రికెట్‌ను గిల్ ఏలుతాడని టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ప్రస్తావనార్హం.
చదవండి: ఇషాన్ కిషన్ అవుట్.. కారణం ఇదే
వర్క్‌లోడ్ తట్టుకోగలరా?
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లకు ఇద్దరేసి కెప్టెన్లు ఉన్నారు. మూడు ఫార్మాట్లకు ఒకరే కెప్టెన్‌గా ఉంటే వర్క్‌లోడ్ తట్టుకోగలరా అనే ప్రశ్న ఎదురవుతోంది. అయితే బౌలర్లతో పోలిస్తే బ్యాటర్లపై కెప్టెన్సీ భారం తక్కువగా ఉంటుందని భారత్ స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ మాజీ కోచ్ రాంజీ శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. ఇంకా చాలా కాలం పాటు క్రికెట్ ఆడే సత్తా గిల్‌కు ఉంది కాబట్టి అతడికిది సానుకూల అంశం అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి గిల్‌ను సూర్యకుమార్ డిప్యూటీ నియమిస్తే అతడికి అనుభవం పెరుగుతుందని, గిల్‌ను పరీక్షించడానికి వచ్చే టి20 ప్రపంచకప్ వరకు తగినంత సమయం కూడా ఉంటుందని అంటున్నారు. చూద్దాం మరి ఏమవుతుందో!