
Photo Credit: @BCCI
ఆసియాకప్ 2025 టోర్నిలో టీమిండియా ఈరోజు తన తొలి మ్యాచ్ ఆడనుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. యంగ్ ప్లేయర్స్‌తో టీమిండియా మంచి ఊపుమీద ఉంది. భారత క్రికెట్ కొత్త పోస్టర్ బాయ్ శుబ్‌మన్ గిల్‌ను టి20 టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా నియమించడంతో పాజిటివ్ బజ్ క్రియేటయింది. ఇదే సమయంలో కెప్టెన్ సూర్యకు పరోక్షంగా హెచ్చరిక జారీ చేసినట్టయింది. 'నీ పోస్టుకు ఎసరు తప్పద'ని సందేశం ఇచ్చినట్టుగా కనబడుతోంది. గిల్‌కు ప్రమోషన్‌తో సూర్యకు సెగ తాకిందా అనే చర్చ మొదలైంది.
టీమిండియా పొట్టి ఫార్మాట్ కెప్టెన్‌గా సూర్య విజయవంతం అయ్యాడు. టి20 టీమ్ నాయకుడిగా అతడి విజయాల శాతం 80 వరకు ఉంది. కానీ ఆటగాడిగా విఫలమవుతున్నాడు. స్కై భారీ ఇన్నింగ్స్ ఆడి చాలా కాలమైంది. కెప్టెన్‌గా జట్టును విజయవంతంగా నడిపించడంతోనే సరిపెట్టుకోకుండా, వ్యక్తిగతంగానూ పరుగులు చేయాలని బీసీసీఐ (BCCI) పెద్దలు కోరుకుంటున్నారు. గత నెల టీమ్ ప్రకటన సందర్భంగా సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 'సిరీస్‌లు గెలవడం ఒక్కటే కెప్టెన్ పనికాదు. అతడి బ్యాట్ నుంచి ధారాళంగా పరుగులు కూడా రావాలి' అంటూ అగార్కర్ కమెంట్ చేశారు.
కెప్టెన్ అయ్యాక రన్స్ డౌన్
సూర్యకుమార్ యాదవ్ 22 మ్యాచ్‌ల్లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి 26.57 సగటుతో 558 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత అతడి బ్యాట్ నుంచి పరుగులు రావడం తగ్గిపోయాయి. కెప్టెన్ కాకముందు 66 మ్యాచ్‌ల్లో 43.40 సగటుతో 2040 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలు, 17 ఫిఫ్టీలు ఉన్నాయి. నాయకత్వ బాధ్యతలు తలకెత్తుకున్న తర్వాత స్కై బ్యాట్ నుంచి పరుగులు రావడం క్రమంగా తగ్గింది. గత ఏడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌పై అతడు చేసిన హాఫ్ సెంచరీ(75) తర్వాత మళ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో అతడు చేసిన అత్యధిక స్కోరు 28.
షార్ట్ సెలక్షన్ బాలేదు
ఆసియాకప్‌లో సూర్య ఎలా ఆడతాడనే దానిపై అతడి భవితవ్యం ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నాయి. అయితే సూర్య పుంజుకుంటాడని, ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తాడని టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ (Wasim Jaffer) అభిప్రాయపడ్డాడు. 'పరుగులు సాధించలేకపోవడమే అతడి సమస్య. ఇంతకుముందు ఆడిన ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో అతడి షార్ట్ సెలక్షన్ స్థాయికి తగినట్టు లేదు. కానీ ఐపీఎల్‌లో మాత్రం బాగా ఆడాడు. పొట్టి ఫార్మాట్‌లో అతడు ప్రమాదకర ఆటగాడు. తనదైన రోజున బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. ఆసియాకప్ భిన్నంగా ఉంటుంది. జట్టు కూర్పు, బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండాలో చూసుకోవడంతోనే సరిపోదు. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా ఎక్కువ పరుగులు చేసి స్కై తన స్థానాన్ని పదిలపరుచుకోవాల'ని జాఫర్ అన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో 16 మ్యాచ్‌ల్లో 717 పరుగులు చేసిన సూర్య.. సాయి సుదర్శన్ తర్వాత రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
చదవండి: యువరాజ్ సింగ్‌కు అప్‌గ్రేడ్ వర్షన్ అతడు
బ్యాట్‌తోనే జవాబిస్తాడు
శుబ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్ నియమించడం వల్ల సూర్యపై ఒత్తిడి పెరగబోదని జాఫర్ అభిప్రాయపడ్డాడు. ప్రతి టోర్నమెంట్‌కు వైస్ కెప్టెన్ ఉంటాడని, అలాగే ప్రతి టోర్నీ కూడా సవాల్‌తో కూడుకున్నదని చెప్పాడు. భారీ స్కోరుతో గతవైభవాన్ని అందుకోవడమే సూర్య తక్షణ కర్తవ్యమని, అంచనాలకు తగినట్టుగా రాణించాలని అన్నాడు. తనపైన ముసురుకున్న నీలి మేఘాలను పటాపంచలు చేయాలని ప్రపంచం ఎదురు చూస్తోందన్నాడు. సూర్యపై తనకు నమ్మకం ఉందని, ఆటతోనే సమాధానం చెబుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా, ఆరంభ రోజుల్లో జాఫర్ కెప్టెన్సీలో ముంబై తరపున సూర్య ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సంగతి క్రికెట్ లవర్స్‌కు గుర్తుండే ఉంటుంది.