
టీమిండియా సెలక్టర్లపై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) ప్రశంసలు కురిపించాడు. టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)ను తిరిగి టీ20 జట్టులోకి పిలిపించి గొప్ప పనిచేశారని కొనియాడాడు. టీమిండియా టీ20 భవిష్యత్ కెప్టెన్‌గా గిల్ చుట్టూ ఇప్పటి నుంచే జట్టును తయారు చేయాలని సూచించాడు.
అక్షర్‌ను తప్పించి గిల్‌కు వైస్ కెప్టెన్సీ
ఆసియా కప్-2025 టోర్నమెంట్‌కు బీసీసీఐ మంగళవారం తమ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా కొనసాగించిన యాజమాన్యం.. అక్షర్ పటేల్ (Axar Patel)ను మాత్రం వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించింది. అంతర్జాతీయ టీ20లకు ఏడాది కాలంగా దూరంగా ఉన్న టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో అక్షర్ స్థానాన్ని భర్తీ చేసింది.
గొప్ప, అద్భుతమైన ఎంపిక
ఈ నేపథ్యంలో గిల్‌ను వైస్ కెప్టెన్ చేయడంపై బీసీసీఐ తీరుపై విమర్శలు వస్తుండగా.. సునిల్ గావస్కర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ‘‘దాదాపు రెండు వారాల క్రితం.. ఇంగ్లండ్ గడ్డ మీద అతడు 750కి పైగా పరుగులు సాధించాడు.
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అలాంటి ఆటగాడిని ఎలా విస్మరించగలరు. అంతేకాదు.. అతడికి వైస్ కెప్టెన్సీ కూడా ఇచ్చారు. దీనిని బట్టి అతడే భవిష్యత్తులో టీ20 జట్టుకు కెప్టెన్ అవుతాడని స్పష్టం చేశారు. నా దృష్టిలో ఇది చాలా చాలా గొప్ప, అద్భుతమైన ఎంపిక’’ అంటూ సెలక్టర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు గావస్కర్.
టీ20 భవిష్యత్ సారథి
ఈ సందర్భంగా జింబాబ్వే పర్యటనలో గిల్ టీ20 జట్టును ముందుకు నడిపించిన తీరును గావస్కర్ ప్రస్తావించాడు. ‘‘టీమిండియా 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత జింబాబ్వే పర్యటనలో గిల్ కెప్టెన్‌గా రాణించాడు. ఇక ఇటీవల ఇంగ్లండ్‌లోనూ టెస్టు కెప్టెన్‌గా ఆకట్టుకున్నాడు.
బ్యాటర్‌గానూ అత్యుత్తమ ప్రదర్శనతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. దీనిని బట్టి అతడు ఒత్తిడిని అధిగమిస్తూ.. ఆటగాడిగానూ ఎలా రాణించగలడో మనం అర్థం చేసుకోవచ్చు. టీ20లలోనూ అతడే కెప్టెన్ అవుతాడు’’ అని గావస్కర్ గిల్‌ను కొనియాడాడు. కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్ టోర్నీకి సెప్టెంబరు 9- 28 వరకు షెడ్యూల్ ఖరారైంది.
ఆసియా కప్ టీ20-2025 టోర్నమెంట్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.
రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.
చదవండి: ‘ఆసియా కప్ ఆడకపోయినా.. వరల్డ్‌కప్ జట్టులో శ్రేయస్ తప్పక ఉంటాడు’