IND vs AUS: శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు ప్రమోష‌న్‌.. బీసీసీఐ ప్రకటన | Shreyas Iyer named India ODI team vice-captain | Sakshi
Sakshi News home page

IND vs AUS: శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు ప్రమోష‌న్‌.. బీసీసీఐ ప్రకటన

Oct 4 2025 4:31 PM | Updated on Oct 4 2025 4:51 PM

Shreyas Iyer named India ODI team vice-captain

టీమిండియా మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ బీసీసీఐ ప్ర‌మోష‌న్ ఇచ్చింది. భార‌త వ‌న్డే జ‌ట్టు వైస్ కెప్టెన్‌గా అయ్య‌ర్‌ను సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశారు. ఆస్ట్రేలియా టూర్‌కు జ‌ట్టు ఎంపిక సంద‌ర్భంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు వ‌న్డే జ‌ట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న శుబ్‌మ‌న్ గిల్‌.. రెగ్యూల‌ర్ కెప్టెన్‌గా ప్ర‌మోష‌న్ పొందాడు.

రోహిత్ శ‌ర్మ స్దానాన్ని గిల్ భ‌ర్తీ చేయ‌నున్నాడు. అయితే  గిల్ కంటే కెప్టెన్‌గా అనుభ‌వం ఎక్కువ‌గా ఉండ‌డంతో శ్రేయ‌స్‌కు భార‌త వ‌న్డే జ‌ట్టు ప‌గ్గాల‌ను అప్ప‌గిస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ మూడు ఫార్మాట్ల‌లో ఒకే కెప్టెన్ ఉండాలనే ఉద్దేశ్యంతో  అజిత్ అగార్కర్ అండ్ కో ఈ ఆకస్మిక నిర్ణ‌యం తీసుకుంది.

భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై కూడా వేటు వేసే అకాశముంది. టెస్టు, వన్డేల్లో భారత సారథిగా ఉన్న గిల్ త్వరలోనే టీ20 జట్టు పగ్గాలను చేపట్టిన ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే టీ20ల్లో వైస్ కెప్టెన్‌గా గిల్‌ను బీసీసీఐ నియమించింది.

అయ్యర్ ఫ్యూచర్ కెప్టెన్‌..
శుబ్‌మన్ గిల్ తర్వాత భారత వన్డే జట్టు పగ్గాలను శ్రేయస్ చేపట్టే అవకాశముంది. అయ్యర్‌కు కెప్టెన్‌గా అపారమైన అనుభవం ఉంది. దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టుతో పాటు ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, కేకేఆర్‌, పంజాబ్ కింగ్స్ టీమ్స్‌ను విజయ పథంలో నడిపించిన ట్రాక్ రికార్డు అతడిది.

అయ్యర్ సారథ్యంలో కేకేఆర్ ఐపీఎల్‌-2024 ఛాంపియన్స్ నిలిచింది. అదేవిధంగా ఐపీఎల్‌-2025లో పంజాబ్ కింగ్స్‌ను రన్నరప్‌గా నిలిపాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో  గ‌త కొంత కాలంగా అయ్య‌ర్ దుమ్ములేపుతున్నాడు. అయితే అయ్య‌ర్ ఈ స్ధాయికి చేరుకోవడానికి తీవ్రంగా శ్ర‌మించాడు.

ఒకనొక దశ‌లో భార‌త జ‌ట్టు త‌ర‌పున‌ అయ్య‌ర్ కెరీర్ ముగిసింద‌ని అంతా భావించారు. బీసీసీఐ త‌మ‌ ఆదేశాల‌ను ధిక్క‌రించ‌డంతో జ‌ట్టుతో పాటు సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ నుంచి త‌ప్పించింది. ఆ త‌ర్వాత  ఈ ముంబైక‌ర్ దేశ‌వాళీ క్రికెట్‌లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచి తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు.

28 ఏళ్ల అయ్య‌ర్ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఈ మెగా టోర్నీలో 11 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 530 ప‌రుగులు చేశాడు. దీంతో బీసీసీఐ కాంట్రాక్ట్‌ను తిరిగి సంపాదించుకున్నాడు. ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025 విజేత‌గా భార‌త్ నిల‌వ‌డంలో అయ్య‌ర్‌ది కీల‌క పాత్ర‌.

అతను ఐదు మ్యాచ్‌లలో 243 పరుగులు సాధించి టోర్నీలో భార‌త త‌ర‌పున లీడింగ్ ర‌న్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఈ క్ర‌మంలో రోహిత్ త‌ర్వాత అయ్య‌ర్‌ను వ‌న్డే కెప్టెన్‌గా ఎంపిక చేయాల‌ని చాలా మంది మాజీలు సూచించారు. కానీ సెల‌క్ట‌ర్లు మాత్రం వైస్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఆసీస్ టూర్ నుంచి కొత్త రోల్‌లో శ్రేయ‌స్ క‌న్పించ‌నున్నాడు.

ఆసీస్ టూర్‌కు భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ , అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌, విరాట్ కోహ్లి

భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్‌), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్‌), వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్‌, సంజూ శాంసన్‌, వాషింగ్టన్ సుందర్‌
చదవండి: BCCI: రోహిత్ శ‌ర్మకు భారీ షాక్‌.. టీమిండియా వ‌న్డే కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement