
దులిప్ ట్రోఫీ ఆరంభానికి ముందు ఈస్ట్ జోన్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఈ రెడ్‌బాల్ టోర్నీకి దూరమయ్యాడు. ఒడిశాకు చెందిన ఆశిర్వాద్ స్వైన్ ఇషాన్ స్థానంలో ఈస్ట్ జోన్‌కు ఎంపికయ్యాడు. కాగా జాతీయ జట్టుకు చాన్నాళ్లుగా దూరంగా ఉన్న ఇషాన్ కిషన్.. ఇటీవల ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడాడు.
టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చినా..
నాటింగ్‌హాంప్‌షైర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఇషాన్.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా రిషభ్ పంత్ (Rishabh Pant) గాయపడి.. ఆఖరి మ్యాచ్‌కు దూరం కాగా.. ఈ వికెట్ కీపర్‌తో పంత్ స్థానాన్ని భర్తీ చేయాలని సెలక్టర్లు భావించారు.
అయితే, ఇషాన్ కిషన్ స్కూటీ మీద నుంచి కిందపడిన కారణంగా.. అతడి ఎడమ పాదానికి గాయమైనట్లు తెలిసింది. దీంతో బోర్డు నుంచి పిలుపు వచ్చినా అతడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ క్రమంలో దులిప్ ట్రోఫీ (Duleep Trophy 2025)లో ఈస్ట్ జోన్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌కు మరోసారి తనను తాను నిరూపించుకునే అవకాశం వచ్చింది.
కారణం ఇదేనా?
కానీ.. ఫిట్‌నెస్ కారణాల వల్ల ఇషాన్ కిషన్ ఈ టోర్నీ మొత్తానికి దూరం కానున్నట్లు తాజా సమాచారం. అతడి స్థానంలో బెంగాల్ మేటి ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ ఈస్ట్ జోన్ సారథిగా వ్యవహరించనున్నాడు. అదే విధంగా.. ఒడిశా యువ ఆటగాడు ఆశిర్వాద్.. వికెట్ కీపర్‌గా ఇషాన్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు.
ఒడిశా నుంచి మూడో ప్లేయర్
ఇక ఒడిశా నుంచి ఇప్పటికే ఈస్ట్ జోన్ జట్టులో సందీప్ పట్నాయక్ ఉండగా.. స్వస్తిక్ సమాల్ స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్నాడు. కాగా ఇషాన్ కిషన్ దులిప్ ట్రోఫీ టోర్నీకి దూరం కావడానికి స్పష్టమైన కారణాలు మాత్రం తెలియలేదు. అయితే, ఒడిషా క్రికెట్ అసోసియేషన్ ప్రకటన ద్వారానే.. ఇషాన్ స్థానంలో ఆశిర్వాద్ జట్టులోకి వచ్చినట్లు వెల్లడైంది.
కాగా 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్.. ఇప్పటి వరకు రెండు టెస్టులు, 27 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ టెస్టుల్లో 78, వన్డేల్లో 933, టీ20 మ్యాచ్‌లలో 796 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 28 నుంచి బెంగళూరు వేదికగా దులిప్ ట్రోఫీ-2025 ఆరంభం కానుంది. కాగా ఇషాన్ కంటే ముందు ఆకాశ్ దీప్ కూడా ఈస్ట్ జోన్ జట్టుకు దూరమయ్యాడు.
దులిప్ ట్రోఫీ-2025 టోర్నీకి ఈస్ట్ జోన్ జట్టు (అప్‌డేటెడ్)
అభిమన్యు ఈశ్వరన్, ఆశీర్వాద్ స్వైన్ (వికెట్ కీపర్), సందీప్ పట్నాయక్, విరాట్ సింగ్, డెనిష్ దాస్, శ్రీదామ్ పాల్, శరణ్‌దీప్ సింగ్, కుమార్ కుషాగ్రా, రియాన్ పరాగ్, ఉత్కర్ష్ సింగ్, మనీషి, సూరజ్ సింధు జైస్వాల్, ముఖేష్ కుమార్, మహ్మద్ షమీ.
స్టాండ్ బై ప్లేయర్లు
ముఖ్తార్ హుస్సేన్, వైభవ్ సూర్యవంశీ, స్వస్తిక్ సమాల్, సుదీప్ కుమార్ ఘరామి, రాహుల్ సింగ్.
చదవండి: ‘ఆసియా కప్-2025 జట్టు ఇదే: సంజూ, రింకూ, తిలక్‌లకు నో ఛాన్స్’