'చేరో ఆర్చర్స్‌'కు రెండో విజయం | Chero Archers secure second consecutive win in Archery Premier League Season 2 | Sakshi
Sakshi News home page

'చేరో ఆర్చర్స్‌'కు రెండో విజయం

Oct 10 2026 4:07 AM | Updated on Oct 10 2026 4:07 AM

Chero Archers secure second consecutive win in Archery Premier League Season 2

సాక్షి, హైదరాబాద్‌: ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌–2లో చేరో ఆర్చర్స్‌ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం చేరో టీమ్‌ 6–2 సెట్‌ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాజ్‌పుతానా రాయల్స్‌ను ఓడించింది. కుంకుమ్‌ మొహొద్, అతాను దాస్‌ సభ్యులుగా ఉన్న ఆర్చర్స్‌ టీమ్‌ 69–78, 78–67, 78–77, 78–72తో రాయల్స్‌పై పైచేయి సాధించింది. మరో వైపు తమ తొలి మ్యాచ్‌లో ఓడిన చోళా చీఫ్స్‌ గెలుపు బోణీ చేయగా, మైటీ మరాఠాస్‌ ఆడిన రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది.

తెలంగాణ ప్లేయర్‌ తానిపర్తి చికిత, సీనియర్‌ ఆర్చర్‌ దీపికా కుమారి ప్రాతినిధ్యం వహిస్తున్న చోళా టీమ్‌ 6–2 (76–74, 76–70, 70–76, 79–76)తో కాకతీయ నైట్స్‌పై గెలుపొందింది. తొలి సారి ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్‌ ఆడిన కొలంబియా ప్లేయర్‌ అలెజాండ్రా యుస్‌క్వినో తాను కొట్టిన 8 బాణాలకు కూడా సరిగ్గా 10 పాయింట్ల చొప్పున సాధించి 80/80 స్కోర్‌ చేయడం విశేషం. 

మరో మ్యాచ్‌లో పృథ్వీరాజ్‌ యోధాస్‌ 6–2 (71–73, 76–75, 79–77, 76–74)తో మైటీ మరాఠాస్‌ టీమ్‌ను ఓడించింది. సీనియర్‌ ప్లేయర్‌ అభిషేక్‌ వర్మ పదునైన ప్రదర్శనతో ముందుండి జట్టును గెలిపించాడు. మరాఠాస్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. నేడు జరిగే మ్యాచ్‌లలో మరాఠాస్‌తో చోళా, యోధాస్‌తో చేరో, రాజ్‌పుతానాతో కాకతీయ తలపడతాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement