అల్‌కరాజ్‌ అద్భుత రీతిలో... | Carlos Alcaraz reached the prequarter final | Sakshi
Sakshi News home page

అల్‌కరాజ్‌ అద్భుత రీతిలో...

Jul 6 2024 4:15 AM | Updated on Jul 6 2024 4:15 AM

Carlos Alcaraz reached the prequarter final

ఐదు సెట్‌ల పోరులో విజయం 

పోరాడి ఓడిన ఫ్రాన్సెస్‌ టియాఫో 

మహిళల్లో కీస్, పావొలిని ముందంజ 

వింబుల్డన్‌ టోర్నీ 

లండన్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ వింబుల్డన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో ఓటమి అంచుల నుంచి గట్టెక్కి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరాడు. శుక్రవారం పురుషుల సింగిల్స్‌లో మూడో రౌండ్‌ దాటేందుకే ప్రస్తుత ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంప్‌ అష్టకష్టాలు పడ్డాడు. ఐదు సెట్ల పాటు సాగిన సుదీర్ఘ పోరాటంలో ఎట్టకేలకు కార్లొస్‌ అల్‌కరాజ్‌ 5–7, 6–2, 4–6, 7–6 (7/2), 6–2తో ఫ్రాన్సెస్‌ టియాఫో (అమెరికా)పై చెమటోడ్చి గెలిచాడు. 

ఈ మ్యాచ్‌లో 29వ సీడ్‌ టియాఫో... స్పెయిన్‌ స్టార్‌కు చుక్కలు చూపించాడు. దాదాపు ఓడించినంత పనిచేశాడు. అల్‌కరాజ్‌ 1–2 సెట్లతో వెనుకబడిన దశలో నాలుగో సెట్‌ హోరాహోరీగా సాగింది. స్కోరు 6–6 వద్ద సమం కాగా... టైబ్రేక్‌ నిర్వహించారు. ఇందులో పుంజుకున్న అల్‌కరాజ్‌ తర్వాత ఆఖరి ఐదో సెట్‌ను సులువుగా గెలుచుకొని ఊపిరి పీల్చుకున్నాడు. 

ఇతర మ్యాచ్‌లలో పదో సీడ్‌ గ్రిగోర్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా) 6–3, 6–4, 6–3తో గేల్‌ మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌)పై వరుస సెట్లలో విజయం సాధించగా, ఐదో సీడ్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా) 6–1, 6–3, 4–6, 1–1తో జాన్‌ లెనార్డ్‌ స్ట్రఫ్‌ (జర్మనీ)పై ఆధిక్యంలో ఉన్న దశలో వర్షం వల్ల మ్యాచ్‌ను నిలిపివేశారు.  మహిళల సింగిల్స్‌లో 12వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా), ఏడో సీడ్‌ జాస్మిన్‌ పావొలిని (ఇటలీ) ప్రిక్వార్టర్స్‌ చేరారు. 

మూడో రౌండ్లో కీస్‌ 6–4, 6–3తో 18వ సీడ్‌ మార్ట కొస్ట్యుక్‌ (ఉక్రెయిన్‌)పై, పావొలిని (ఇటలీ) 7–6 (7/4), 6–1తో బియాంక ఆండ్రీస్కు (కెనడా)పై విజయం సాధించారు. మరో మ్యాచ్‌లో ఎమ్మా నవారో (అమెరికా) 2–6, 6–3, 6–4తో డయానా స్నైడెర్‌ (రష్యా)పై నెగ్గింది.  

ముర్రే నిష్క్రమణ... 
స్థానిక బ్రిటన్‌ స్టార్‌ ఆండీ ముర్రే కెరీర్‌ ప్రఖ్యాత వింబుల్డన్‌లో తొలి రౌండ్‌ ఓటమితో ముగిసింది. సోదరుడు జేమీ ముర్రేతో కలిసి అతను డబుల్స్‌ బరిలోకి దిగాడు. ముర్రే జోడీ 6–7 (6/8), 4–6 స్కోరుతో రింకీ హిజికట–జాన్‌ పీర్స్‌ (ఆస్ట్రేలియా) ద్వయం చేతిలో ఓడింది. దీంతో రెండు సార్లు వింబుల్డన్‌ సింగిల్స్‌ చాంప్‌ (2013, 2016) ముర్రేకు ప్రేక్షకులంతా స్టాండింగ్‌ ఒవేషన్‌తో గౌరవ వందం ఇచ్చారు. 

దిగ్గజాలు ఫెడరర్, నాదల్, జొకోవిచ్, వీనస్‌ విలియమ్స్‌లు వీడియో సందేశాల ద్వారా అతనికి ఫేర్‌వెల్‌ పలికారు. వర్షం కారణంగా వింబుల్డన్‌ టోర్నీకి అంతరాయం కలిగింది. పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లను నిలిపివేసి శనివారానికి వాయిదా వేశారు.  
యూకీ, బాలాజీ జోడీలు అవుట్‌ 
డబుల్స్‌లో భారత ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది. యూకీ బాంబ్రీ పోరాటం రెండో రౌండ్లో ముగియగా, శ్రీరామ్‌ బాలాజీ కనీసం తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. రెండో రౌండ్‌లో యూకీ–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్‌) జోడీ 6–4, 4–6, 3–6తో జర్మనీకి చెందిన కెవిన్‌ క్రావిట్జ్‌–టిమ్‌ ప్యుయెట్జ్‌ జంట చేతిలో పరాజయం చవి చూసింది. 

తొలి సెట్‌లో కనబరిచిన ఉత్సాహం తర్వాతి సెట్లలో కొనసాగించడంతో భారత్‌–ఫ్రాన్స్‌ ద్వయం విఫలమైంది. మరో మ్యాచ్‌లో శ్రీరామ్‌ బాలాజీ జంటకు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. బాలాజీ–జాన్సన్‌ (బ్రిటన్‌) జంట 4–6, 5–7తో నాలుగో సీడ్‌ మార్సెలొ అరెవలో (సాల్వేడార్‌)– మేట్‌ పావిచ్‌ (క్రొయేషియా) జోడీ చేతిలో ఓడింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement