
తొలి రౌండ్‌లోనే ఓడిన మెద్వెదెవ్, రూనె సబలెంకా శుభారంభం
మాజీ రన్నరప్ ఆన్స్ జబర్ నిష్క్రమణ
‘హ్యాట్రిక్’ టైటిల్ లక్ష్యంగా వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నిలో బరిలోకి దిగిన స్పెయిన్ స్టార్ అల్‌కరాజ్‌కు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. తొలి రౌండ్ అడ్డంకిని అలవోకగా అధిగమిస్తాడని భావించినా... ఇటలీ సీనియర్ ప్లేయర్ ఫాగ్‌నిని పోరాటపటిమ కారణంగా ఏకంగా 4 గంటల 37 నిమిషాలు చెమటోడ్చి... చివరకు ఐదు సెట్‌ల పోరులో అల్‌కరాజ్ గట్టెక్కాడు.
లండన్: టెన్నిస్ సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్‌లో తొలి రోజు సంచలన ఫలితాలు నమోదయ్యాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో రష్యా స్టార్, తొమ్మిదో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా), ఎనిమిదో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టగా... డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ అల్‌కరాజ్ (స్పెయిన్) తొలి రౌండ్‌ను దాటేందుకు తీవ్రంగా శ్రమించాడు. ప్రపంచ 138వ ర్యాంకర్ ఫాబియో ఫాగ్‌నిని (ఇటలీ)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్‌కరాజ్ 7–5, 6–7 (5/7), 7–5, 2–6, 6–1తో గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకున్నాడు.
4 గంటల 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్‌కరాజ్ 14 ఏస్‌లు సంధించి, 9 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 62 అనవసర తప్పిదాలు చేసి, 52 విన్నర్స్ కొట్టాడు. తన సరీ్వస్‌ను ఐదుసార్లు కోల్పోయిన అల్‌కరాజ్... ప్రత్యర్థి సరీ్వస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో బెంజిమిన్ బోంజి (ఫ్రాన్స్) 3 గంటల 7 నిమిషాల్లో 7–6 (7/2), 3–6, 7–6 (7/3), 6–2తో మెద్వెదెవ్‌పై... నికోలస్ జారీ (చెక్ రిపబ్లిక్) 3 గంటల 34 నిమిషాల్లో 4–6, 4–6, 7–5, 6–3, 6–4తో హోల్గర్ రూనెపై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. వాలెంటిన్ రాయర్ (ఫ్రాన్స్)తో జరిగిన మ్యాచ్‌లో 24వ సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) తొలి రెండు సెట్‌లను 3–6, 2–6తో కోల్పోయాక వెన్నునొప్పితో ఆటను కొనసాగించలేక వైదొలిగాడు.
నిశేష్ కు నిరాశ
కెరీర్‌లో తొలిసారి వింబుల్డన్ టోర్నిలో ఆడుతున్న తెలుగు సంతతికి చెందిన అమెరికా ప్లేయర్ నిశేష్ బసవరెడ్డికి నిరాశ ఎదురైంది. తొలి రౌండ్‌లో 20 ఏళ్ల నిశేష్ 6–7 (5/7), 3–6, 2–6తో అమెరికాకే చెందిన లెర్నర్ టియెన్ చేతిలో ఓడిపోయాడు. నిశేష్‌కు 66,000 పౌండ్లు (రూ. 77 లక్షల 56 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
కష్టపడ్డ కీస్
మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సబలెంకా (బెలారస్) శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో సబలెంకా 6–1, 7–5తో కార్సన్ బ్రాన్‌స్టిన్ (కెనడా)పై గెలిచింది. ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్, ఆరో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) గెలిచేందుకు కష్టపడింది. 2 గంటల 41 నిమిషాల పోరులో కీస్ 6–7 (4/7), 7–5, 7–5తో ఎలీనా రూసె (రొమేనియా)పై నెగ్గింది. 20వ సీడ్, 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఒస్టాపెంకో (లాతి్వయా)... 2022, 2023 రన్నరప్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా) తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు.
తొమోవా (బల్గేరియా)తో జరిగిన మ్యాచ్‌లో జబర్ తొలి సెట్‌ను 6–7 (5/7)తో కోల్పోయి, రెండో సెట్‌లో 0–2తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగింది. బ్రిటన్ ప్లేయర్ సోనె కార్టల్ 7–5, 2–6, 6–2తో ఒస్టాపెంకోను ఓడించి రెండో రౌండ్‌కు చేరింది. టోర్నీ మొదటిరోజు రికార్డు స్థాయిలో 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో ఆటగాళ్లకు పట్టపగలే చుక్కలు కనబడ్డాయి. చాలా మంది ప్లేయర్లు మ్యాచ్ మధ్యలో బ్రేక్‌లు తీసుకుంటూ... ఐస్ ప్యాక్‌లతో శరీరాన్ని చల్లబర్చుకుంటూ... ఆటను కొనసాగించారు.