చేరువై... దూరమై...

Borna Coric Won In US Open Round 3 - Sakshi

ఆరు మ్యాచ్‌ పాయింట్లు వదులుకొని ఓడిపోయిన నాలుగో సీడ్‌ సిట్సిపాస్‌

ఓటమి అంచుల నుంచి అద్భుత విజయం సాధించిన క్రొయేషియా ప్లేయర్‌ బొర్నా చోరిచ్‌

టైటిల్‌ ఫేవరెట్స్‌లో ఒకడు... భవిష్యత్‌ తారగా పేరు తెచ్చుకుంటున్న ‘గ్రీకు వీరుడు’ స్టెఫానోస్‌ సిట్సిపాస్‌... యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో 22 ఏళ్ల ఈ యువతారకు శనివారం గుండె పగిలే ఫలితం ఎదురైంది. విజయానికి అతి సమీపంలోకి వచ్చిన సిట్సిపాస్‌... ఆ తర్వాత నెమ్మదిగా ఆ విజయానికి దూరమై... చివరకు తన కెరీర్‌లోనే అత్యంత చేదు అనుభవాన్ని చవిచూశాడు. ఒకటా.. రెండా... మూడా... నాలుగా... ఏకంగా ఆరంటే ఆరు మ్యాచ్‌ పాయింట్లను వదులుకున్న సిట్సిపాస్‌ చివరకు 4 గంటల 36 నిమిషాల ఆటలో పరాజయ భారంతో బరువెక్కిన హృదయంతో కోర్టును వీడాల్సి వచ్చింది. మరోవైపు సిట్సిపాస్‌ ప్రత్యర్థి బొర్నా చోరిచ్‌... ఓటమి అంచుల నుంచి తేరుకొని... ఆరు మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకొని... తన కెరీర్‌లోనే చిరస్మ రణీయ విజయాన్ని అందుకున్నాడు.

న్యూయార్క్‌: పోరాడితే పోయేదేమీ లేదన్నట్టుగా... ప్రత్యర్థి విజయం అంచుల్లో ఉన్నా... చివరి పాయింట్‌ను కూడా సులువుగా ఇవ్వకూడదని పట్టుదల కనబరిచిన క్రొయేషియా యువతార బొర్నా చోరిచ్‌ చివరకు తన కెరీర్‌లోనే అద్భుత విజయం సాధించాడు. యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో 23 ఏళ్ల చోరిచ్‌ ఓటమి బాట నుంచి గెలుపు బాట పట్టి విజయకేతనం ఎగురవేసి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ ఆరో ర్యాంకర్, నాలుగో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)తో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో ప్రపంచ 32వ ర్యాంకర్‌ చోరిచ్‌ 6–7 (2/7), 6–4, 4–6, 7–5, 7–6 (7/4)తో గెలుపొందాడు. 4 గంటల 36 నిమిషాలపాటు సాగిన ఈ సమరంలో సిట్సిపాస్‌ 16 ఏస్‌లు సంధించాడు.

మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసిన అతను ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేయడంతోపాటు 43 అనవసర తప్పిదాలు చేశాడు. చోరిచ్‌ కేవలం నాలుగు ఏస్‌లు సంధించినా... 50 అనవసర తప్పిదాలు చేసినా... కీలకదశలో సిట్సిపాస్‌ సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేసి అనుకున్న ఫలితం సాధించాడు. నాలుగో సెట్‌లో సిట్సిపాస్‌ ఒకదశలో 5–1తో ఆధిక్యంలో ఉన్నాడు. ఆ తర్వాత మూడు గేమ్‌లు కోల్పోయిన సిట్సిపాస్‌ స్కోరు 5–4తో ఉన్నదశలో తన సర్వీస్‌లో 40–0తో ఆధిక్యం సంపాదించి విజయానికి కేవలం ఒక్క పాయింట్‌ దూరంలో నిలిచాడు. కానీ దానిని మాత్రం అందుకోలేకపోయాడు. వరుసగా మూడు మ్యాచ్‌ పాయింట్లు కాచుకున్న చోరిచ్‌ ఆ తర్వాత మరో మూడుసార్లు ఇలాగే చేశాడు.

ఓవరాల్‌గా సిట్సిపాస్‌ సర్వీస్‌ చేసిన తొమ్మిదో గేమ్‌లో ఆరు మ్యాచ్‌ పాయింట్లను కాచుకున్న చోరిచ్‌ చివరకు గేమ్‌ సొంతం చేసుకొని స్కోరును 5–5తో సమం చేశాడు. ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 12వ గేమ్‌లో మళ్లీ సిట్సిపాస్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి నాలుగో సెట్‌ను 7–5తో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక ఐదో సెట్‌లో చోరిచ్‌ ఐదో గేమ్‌లో తన సర్వీస్‌ను కోల్పోయి 2–3తో వెనుకబడిన దశలో వెంటనే కోలుకొని సిట్సిపాస్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి స్కోరును 3–3తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్‌ అనివార్యమైంది. టైబ్రేక్‌లో చోరిచ్‌ పైచేయి సాధించగా... ఒత్తిడికి చిత్తయిన సిట్సిపాస్‌ చేతులెత్తేశాడు.  

జొకోవిచ్‌ 26–0
మరోవైపు టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ ఈ సీజన్‌లో వరుసగా 26వ గెలుపుతో ఈ టోర్నీలో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. మూడో రౌండ్‌లో జొకోవిచ్‌ 6–3, 6–3, 6–1తో జాన్‌ లెనార్డ్‌ స్ట్రఫ్‌ (జర్మనీ)పై గెలిచాడు. ఐదో సీడ్‌  జ్వెరెవ్‌ (జర్మనీ) 6–7 (4/7), 6–4, 6–2, 6–2తో మనారినో (ఫ్రాన్స్‌)పై, ఏడో సీడ్‌ గాఫిన్‌ (బెల్జియం) 6–1, 7–6 (7/5), 6–4తో క్రాజినోవిచ్‌ (సెర్బియా)పై, 12వ సీడ్‌ షపోవలోవ్‌ (కెనడా) 3–6, 6–3, 4–6, 7–6 (7/5), 6–2తో టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)పై, పదో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా) 6–0, 6–4, 6–0తో కరుసో (ఇటలీ)పై గెలిచారు.  

శ్రమించిన ఒసాకా...
మహిళల సింగిల్స్‌ విభాగంలో నాలుగో సీడ్‌ నయోమి ఒసాకా (జపాన్‌), ఆరో సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌), మాజీ చాంపియన్‌ కెర్బర్‌ (జర్మనీ) ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నారు. మూడో రౌండ్‌లో ఒసాకా 2 గంటల 33 నిమిషాలు పోరాడి 6–3, 6–7 (4/7), 6–2తో మార్టా కోస్టుక్‌ (ఉక్రెయిన్‌)ను ఓడించగా... క్విటోవా 6–4, 6–3తో జెస్సికా (అమెరికా)పై, కెర్బర్‌ 6–3, 6–4తో యాన్‌ లీ (అమెరికా)పై నెగ్గారు. 14వ సీడ్‌ కొంటావె (ఎస్తోనియా) 6–3, 6–2తో మాగ్దా లినెట్టి (పోలాండ్‌)పై, 15వ సీడ్‌ మరియా సాకరి (గ్రీస్‌) 6–3, 6–1తో అనిసిమోవా (అమెరికా)పై గెలిచారు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–షపోవలోవ్‌ (కెనడా) జంట 6–2, 6–4తో ఎస్కోబెడో–రూబిన్‌ (అమెరికా) జోడీపై విజయం సాధించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top