సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 వేదికల్లో 600 జట్లతో తెలుగు ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) క్రికెట్ టోర్నీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ లీగ్‌కు సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. టీపీఎల్ నిర్వాహకులైన జూపర్ ఎల్‌ఈడీ సంస్థ ప్రతినిధులు మంగళవారం మంత్రిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి లీగ్ విశేషాలను వివరించారు.
యువతను మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా క్రమశిక్షణ గల క్రీడాకారులుగా, బాధ్యయుత పౌరుడిగా తయారు చేసే శక్తి క్రీడలకు ఉందని శ్రీహరి అన్నారు. క్రికెట్‌తో పాటు ఏదో ఒక క్రీడలో యువత రాణించాలని, తద్వారా ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ కూడా అలవడుతుందని చెప్పారు.
‘సే నో టూ’ డ్రగ్స్ ప్రచారాన్ని యువతలోకి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న ఈ టీపీఎల్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం లీగ్ నిర్వాహక సంస్థ జూపర్ ఎల్‌ఈడీ డైరెక్టర్ ఒ.రమేశ్ మాట్లాడుతూ తమ సీఎస్‌ఆర్ నిధులతో ఈ పోటీలను నిర్వహిస్తోందని తెలిపారు.
ఈ లీగ్‌ను కేవలం వినోదం కోసం నిర్వహించకుండా సమాజంలో ఆరోగ్య భద్రత, ఫిట్‌నెస్, క్రీడలపై అవగాహన పెంచేందుకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 80 లక్షలు అని ఆయన చెప్పారు.
చదవండి: ప్రపంచ క్రికెట్‌ను శాశించేందుకు మరో వసంతంలోకి అడుగుపెట్టిన కోహ్లి


