
టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో, మానవత్వం ప్రదర్శించడంలోనూ అంతే దూకుడుగా ఉంటాడు. ఇటీవల ఇంగ్లండ్ గడ్డపై పాదం ఫ్రాక్చర్ అయినా బరిలోకి దిగి యావత్ క్రికెట్ ప్రపంచంచే జేజేలు పలికించుకున్న పంత్.. తాజాగా ఓ చర్య ద్వారా గొప్ప మానవతావాది అని నిరూపించుకున్నాడు.
కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోట్ జిల్లాలోని రబ్కవి గ్రామానికి చెందిన జ్యోతి కనబుర్ మఠ్ అనే విద్యార్థిని చదువుకు ఆర్దిక సాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు. జ్యోతి 12వ తరగతిలో 85 శాతం మార్కులు సాధించింది. BCA చదవాలన్న ఆశతో ఉన్న ఆమెకు రూ. 40,000 ఫీజు కట్టలేని పరిస్థితి ఏర్పడింది.
తండ్రి టీ కొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో, రిషబ్ పంత్ స్పందించి జులై 17న నేరుగా కాలేజీకి ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాడు. “నీ కలలు నిజమవ్వాలి” అంటూ ఆమెకు భరోసా ఇచ్చాడు.
పంత్ చేసిన ఈ పనికి యావత్ మానవాళి జేజేలు కొడుతుంది. ఆటలో ధీరుడు, గుణంలో కర్ణుడు అంటూ ఆకాశానికెత్తుతుంది. రియల్ హీరో అంటూ కొనియాడుతుంది. వాస్తవానికి పంత్‌కు ఇలాంటి దానాలు కొత్త కాదు. గతంలో చాలా సందర్భాల్లో పేదలకు ఆర్దిక సాయం చేశాడు. రిషబ్ పంత్ ఫౌండేషన్ ద్వారా తనకు వచ్చే ఆదాయంలో 10 శాతం పేదలకు పంచి పెడుతున్నాడు. విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో అవసరమైన వారికి తగు సాయం చేస్తుంటాడు.
గతంలో ఓ సందర్భంలో పంత్ మాట్లాడుతూ.. క్రికెట్ వల్ల నాకు లభించిన ప్రతిదానికి నేను కృతజ్ఞుడిని. ఇప్పుడు సమాజానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నానని అన్నాడు.
తన ఆటతీరుతో విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను మెప్పించిన పంత్.. తన మానవతా గుణంతో దేశ ప్రజల మనసులు గెలుచుకుంటున్నాడు. సమాజానికి సేవ చేయాలనే తపనతో ఉన్న పంత్ చర్యలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.
కాగా, తాజాగా ముగిసిన టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అయితే దురదృష్టవశాత్తు నాలుగో టెస్ట్ సందర్భంగా గాయపడి చివరి మ్యాచ్‌కు దూరమయ్యాడు. నాలుగో టెస్ట్‌లో పాదం ఫ్రాక్చర్ అయినా పంత్ బ్యాటింగ్‌కు దిగి అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఈ సిరీస్‌లో పంత్ 7 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 479 పరుగులు చేసి, ఆరో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌ను భారత్ 2-2తో సమం చేసుకుంది.