గ్లెన్‌ మాక్స్‌వెల్‌ సంచలన నిర్ణయం? | BBL 2024: All Rounder Glenn Maxwell Set To Quit As Melbourne Stars Captain, See Details Inside - Sakshi
Sakshi News home page

Glenn Maxwell Captaincy Quit: గ్లెన్‌ మాక్స్‌వెల్‌ సంచలన నిర్ణయం?.. కెప్టెన్సీకి గుడ్‌ బై!

Published Fri, Jan 19 2024 9:24 PM

BBL 2024: All Rounder Maxwell Set To Quit As Melbourne Stars Captain - Sakshi

BBL 2024- Glenn Maxwell: ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక బిగ్‌ బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు సారథ్యం వహిస్తున్న అతడు కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ఇప్పటికే జట్టు యాజమాన్యానికి తెలియజేసినట్లు ఆసీస్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కాగా జాన్‌ హేస్టింగ్స్‌ రిటైర్మెంట్‌ తర్వాత బీబీఎల్‌ సీజన్‌ 8 సందర్భంగా మాక్సీ మెల్‌బోర్న్‌ స్టార్స్‌ నాయకుడిగా పగ్గాలు చేపట్టాడు. తొలి రెండు సీజన్లలో కెప్టెన్‌గా అదరగొట్టిన ఈ స్పిన్‌ ఆల్‌రౌండర్‌.. టీమ్‌ను ఫైనల్‌ వరకు తీసుకెళ్లాడు. అయితే, ఆ రెండు పర్యాయాల్లో తొలుత మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌.. తర్వాత సిడ్నీ సిక్సర్స్‌ చేతిలో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఓడిపోయింది.

ఆఖరి మెట్టుపై బోల్తా పడి టైటిల్‌ను చేజార్చుకుంది. అనంతర ఎడిషన్లలో నిరాశజనక ప్రదర్శన కనబరిచిన స్టార్స్‌.. బీబీఎల్‌ 12 సీజన్‌లో కెప్టెన్‌ మాక్స్‌వెల్‌ సేవలు కోల్పోయింది. కాలు విరిగిన కారణంగా మాక్సీ గతేడాది సీజన్‌కు దూరం కాగా.. తాజాగా జరుగుతున్న పదమూడో ఎడిషన్‌తో తిరిగి జట్టుతో చేరాడు.

ఈ క్రమంలో ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం 243 పరుగులు మాత్రమే చేసి.. ఏడు వికెట్లు తీయగలిగాడు. కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. మాక్సీ సారథ్యంలో తొలి మూడు మ్యాచ్‌లు ఓడి హ్యాట్రిక్‌ పరాజయాలు నమోదు చేసిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌.. తర్వాత కోలుకుంది.

వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఫామ్‌లోకి వచ్చింది. కానీ.. ఆ తర్వాత పాత కథే పునరావృతమైంది. మరుసటి మూడు మ్యాచ్‌లలో వరుసగా ఓడి ఫైనల్‌ చేరే అవకాశాలు చేజార్చుకుంది మెల్‌బోర్న్‌ స్టార్స్‌. తద్వారా పాయింట్ల పట్టికలో ఆరోస్థానానికే పరిమితమైంది.

ఈ నేపథ్యంలో తీవ్రంగా నిరాశచెందిన మాక్స్‌వెల్‌ కెప్టెన్సీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌ తన కథనంలో పేర్కొంది. కాగా ఐదేళ్లపాటు మెల్‌బోర్న్‌ స్టార్స్‌ సారథిగా కొనసాగిన గ్లెన్‌ మాక్స్‌వెల్‌.. 35 మ్యాచ్‌లలో జట్టును గెలిపించాడు. అదే విధంగా అతడి ఖాతాలో 31 ఓటములు కూడా ఉన్నాయి.

కాగా మాక్సీ స్టార్స్‌తో కాంట్రాక్ట్‌ కూడా రద్దు చేసుకోవాలని భావిస్తుండగా.. ఫ్రాంఛైజీ మాత్రం అతడితో మరో రెండేళ్లు బంధం కొనసాగించాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బీబీఎల్‌ చరిత్రలో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవకపోవడం గమనార్హం.

చదవండి: చెలరేగిన హైదరాబాద్‌ బౌలర్లు, బ్యాటర్లు.. తొలిరోజే 302 రన్స్‌ ఆధిక్యం! తిలక్‌ రీ ఎంట్రీతో..

Advertisement
 

తప్పక చదవండి

Advertisement