తొలిరోజే దంచికొట్టిన హైదరాబాద్‌ బ్యాటర్లు.. 302 రన్స్‌ ఆధిక్యం | Sakshi
Sakshi News home page

చెలరేగిన హైదరాబాద్‌ బౌలర్లు, బ్యాటర్లు.. తొలిరోజే 302 రన్స్‌ ఆధిక్యం! తిలక్‌ రీ ఎంట్రీతో..

Published Fri, Jan 19 2024 7:11 PM

Ranji Trophy 2024 Hyd Vs SKM: Tilak Re Entry Sikkim All Out For 79 - Sakshi

Hyderabad vs Sikkim Day 1 - Hyderabad lead by 302 runs: టీమిండియా యువ బ్యాటర్‌ తిలక్‌ వర్మ రంజీల్లో తిరిగి అడుగుపెట్టాడు. రంజీ ట్రోఫీ-2024 సీజన్‌లో హైదరాబాద్‌ కెప్టెన్‌గా బరిలోకి దిగిన ఈ లెఫ్టాండర్‌.. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌ ఆరంభమైన తర్వాత దేశవాళీ జట్టుకు దూరమయ్యాడు.

మొహాలీ వేదికగా అఫ్గన్‌తో జరిగిన తొలి టీ20లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌ చేశాడు. ఆ మ్యాచ్‌లో 22 బంతులు ఎదుర్కొన్న తిలక్‌ 26 పరుగులు సాధించాడు. ఇక రెండో టీ20తో విరాట్‌ కోహ్లి పునరాగమనం చేసిన నేపథ్యంలో తిలక్‌పై వేటు పడింది. 

ఈ నేపథ్యంలో మళ్లీ దేశవాళీ క్రికెట్‌ ఆడేందుకు సిద్దమయ్యాడు ఈ హైదరాబాద్‌ బ్యాటర్‌. ఈ క్రమంలో శుక్రవారం నాటి హైదరాబాద్‌- సిక్కిం మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. 

79 పరుగులకే సిక్కిం ఆలౌట్‌
ఈ మ్యాచ్‌లో సిక్కిం టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే, హైదరాబాద్‌ బౌలర్లు టి.త్యాగరాజన్‌ ఆరు వికెట్లతో చెలరేగగా.. సీవీ మిలింద్‌ 4 వికెట్లతో సత్తా చాటాడు. వీరిద్దరి దెబ్బకు సిక్కిం 79 పరుగులకే ఆలౌట్‌ అయింది.

ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్లు తన్మయ్‌ అగర్వాల్‌(137), గహ్లోత్‌ రాహుల్‌ సింగ్‌(83) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ రోహిత్‌ రాయుడు సైతం 75 పరుగులతో రాణించాడు.

వరుసగా రెండు విజయాలు
ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్‌ తిలక్‌ వర్మ 66 బంతుల్లోనే 70 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా మరో ఎండ్‌లో సహకారం అందిస్తున్న చందన్‌ సహానీ 8 పరుగులు చేశాడు. తొలిరోజు ఆట ముగిసే సరికి వీరిద్దరు అజేయంగా నిలవగా.. హైదరాబాద్‌ ఏకంగా 302 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

ఇదిలా ఉంటే.. రంజీ తాజా సీజన్‌లో ప్లేట్‌ గ్రూపులో ఉన్న హైదరాబాద్‌ జట్టు ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లలో విజయాలు సాధించింది. తిలక్‌(అజేయ సెంచరీ) సారథ్యంలో నాగాలాండ్‌పై, గహ్లోత్‌ రాహుల్‌ సింగ్‌ కెప్టెన్సీలో మేఘాలయపై గెలుపొందింది.

తాజాగా మళ్లీ తిలక్‌ నేతృత్వంలో ఆడుతున్న హైదరాబాద్‌ ఈసారి సిక్కింను కూడా ఓడించాలని పట్టుదలగా ఉంది. ఇక రంజీ సీజన్‌-2024లో హైదరాబాద్‌కు ఇది మూడో మ్యాచ్‌!

చదవండి: Ranji Trophy 2024: బ్యాట్‌తో చెలరేగిన దూబే.. టెస్టుల్లోనూ ఎంట్రీకి సై!

 
Advertisement
 
Advertisement