ఐర్లాండ్ లక్ష్యం 509; ప్రస్తుతం 176/6
మిర్పూర్: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు... సొంతగడ్డపై ఐర్లాండ్‌తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసే దిశగా సాగుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో విజయం సాధించి 1–0తో ఆధిక్యంలో ఉన్న బంగ్లాదేశ్... రెండో టెస్టులో ప్రత్యర్థి ముందు 509 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఐర్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 54 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
హ్యారీ టెక్టర్ (80 బంతుల్లో 50; 7 ఫోర్లు)హాఫ్ సెంచరీతో మెరవగా... కర్టీస్ కాంపెర్ (93 బంతుల్లో 34 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడుతున్నాడు. కెప్టెన్ ఆండీ బాల్‌బిర్నీ (13)తో పాటు పాల్ స్టిర్లింగ్ (9), కార్మిచెల్ (10), టకర్ (7) విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 3 వికెట్లు పడగొట్టగా... హసన్ మురాద్ 2 వికెట్లు తీశాడు.
నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 4 వికెట్లు ఉన్న ఐర్లాండ్ జట్టు... విజయానికి ఇంకా 333 పరుగులు చేయాల్సి ఉంది. కాంపెర్‌తో పాటు మెక్‌బ్రినె (11 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 156/1తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్... చివరకు 69 ఓవర్లలో 297/4 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ప్రత్యర్థి ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది.
మహ్ముదుల్ హసన్ జాయ్ (91 బంతుల్లో 60; 6 ఫోర్లు), షాద్‌మన్ ఇస్లామ్ (119 బంతుల్లో 78; 7 ఫోర్లు), మోమినుల్ హక్ (118 బంతుల్లో 87; 10 ఫోర్లు), ముషి్ఫకర్ రహీమ్ (81 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో కదంతొక్కారు. కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న ముషి్ఫకర్ రహీమ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడంతో పాటు... రెండో ఇన్నింగ్స్‌లో అజేయ అర్ధశతకంతో రాణించాడు. ఐర్లాండ్ బౌలర్లలో గవిన్ 2 వికెట్లు పడగొట్టాడు.
249 తైజుల్ ఇస్లామ్ వికెట్ల సంఖ్య. టెస్టుల్లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షకీబ్ అల్ హసన్ (246)ను తైజుల్ అధిగమించాడు.


