ఆస్ట్రేలియా అరుదైన రికార్డు.. 149 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే | Australia Achieve Unique Feat vs South Africa A Glaring Concern Pops Up | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా అరుదైన రికార్డు.. 149 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే

Oct 10 2026 1:53 PM | Updated on Oct 10 2026 2:32 PM

Australia Achieve Unique Feat vs South Africa A Glaring Concern Pops Up

డర్బన్ వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్‌ ఓ అరుదైన రికార్డుకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 30 ఏళ్లు నిండిన ఆటగాళ్లతో కూడిన ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగింది. తద్వారా 149 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఒక జట్టు 30 ఏళ్లు నిండిన 11 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగడం ఇదే తొలిసారి.

కాగా కామెరూన్ గ్రీన్ గాయపడటంతో ఆస్ట్రేలియా తుది జట్టులో 30 ఏళ్ల మ్యాట్ రెన్‌షాకు చోటు దక్కింది. మరోవైపు, 34 ఏళ్ల నిక్ మాడిసన్ దాదాపు 10 ఏళ్ల తర్వాత తిరిగి టెస్టు జట్టులోకి పునరాగమనం చేశాడు. ఈ ఇద్దరూ స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, అలెక్స్ కేరీ వంటి సీనియర్ ఆటగాళ్లతో కలిసి డర్బన్ టెస్ట్‌లో బరిలోకి దిగారు. దీంతో మొత్తం జట్టులోని పదకొండు మంది ఆటగాళ్లు 30 ఏళ్లు పైబడిన వారే.

తడబడిన ఆసీస్ బ్యాటర్లు..
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు తడబడ్డారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్, తొలి రోజు ఆట ముగిసే సమయానికి 65.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. రెన్‌షా (115 బంతుల్లో 46 నాటౌట్; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... లబుషేన్ (37; 6 ఫోర్లు), కెప్టెన్ కమిన్స్ (33 బ్యాటింగ్; 5 ఫోర్లు) పర్వాలేదనిపించారు.

రెన్‌షా, కమిన్స్ ఏడో వికెట్‌కు అభేద్యంగా 63 పరుగులు జోడించారు. అయితే హెడ్ (9), మ్యాడిసన్ (0), కారీ (14), వెబ్‌స్టర్ (4), స్టీవ్ స్మిత్ (25) విఫలమయ్యారు. సఫారీ బౌలర్లలో యాన్సెన్, ముల్డర్, నోర్జే తలా రెండు వికెట్లు పడగొట్టారు. 2018 ‘సాండ్‌పేపర్’ వివాదం అనంతరం తొలిసారి దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న ఆసీస్ జట్టు తొలి రోజు ఆటలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement