నాలుగో టి20లో 48 పరుగులతో ఆసీస్ ఓటమి
సిరీస్‌లో టీమిండియా 2–1తో ముందంజ
రాణించిన అక్షర్, సుందర్
రేపు బ్రిస్బేన్‌లో ఆఖరి టి20
కరారా: ఆ్రస్టేలియా పర్యటనలో వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు టి20 సిరీస్‌ను కోల్పోకుండా తిరిగి రావడం ఖాయమైంది. చివరి పోరులో సత్తా చాటితే సిరీస్‌ను గెలుచుకునే అవకాశం కూడా టీమిండియా ముందుంది. గురువారం ఏకపక్షంగా సాగిన నాలుగో టి20 మ్యాచ్‌లో భారత్ 48 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాను ఓడించింది. తాజా ఫలితంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలో నిలిచింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.
శుబ్‌మన్ గిల్ (39 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా... అభిషేక్ శర్మ (21 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్), శివమ్ దూబే (18 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్), అక్షర్ పటేల్ (11 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (10 బంతుల్లో 20; 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించారు. గిల్, అభిషేక్ తొలి వికెట్‌కు 40 బంతుల్లో 56 పరుగులు జోడించి సరైన ఆరంభం అందించగా, తర్వాతి బ్యాటర్లు తలా ఓ చేయి వేశారు.
ఆసీస్ బౌలర్లలో ఎలిస్, జంపా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆ్రస్టేలియా 18.2 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (24 బంతుల్లో 30; 4 ఫోర్లు), మాథ్యూ షార్ట్ (19 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా ఇతర బ్యాటర్లు ప్రభావం చూపలేకపోయారు. ఒకదశలో 91/3తో మెరుగైన స్థితిలో కనిపించిన ఆసీస్ తర్వాతి 28 పరుగులకే మిగిలిన 7 వికెట్లు చేజార్చుకొని కుదేలైంది.
వాషింగ్టన్ సుందర్ 8 బంతులు వేసి 3 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... అక్షర్ పటేల్, శివమ్ దూబే చెరో 2 వికెట్లు తీశారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన అక్షర్ పటేల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. ఇరు జట్ల మధ్యచివరిదైన ఐదో టి20 శనివారం బ్రిస్బేన్‌లో జరుగుతుంది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) డేవిడ్ (బి) జంపా 28; గిల్ (బి) ఎలిస్ 46; దూబే (బి) ఎలిస్ 22; సూర్యకుమార్ (సి) డేవిడ్ (బి) బార్త్‌లెట్ 20; తిలక్ వర్మ (సి) ఇన్‌గ్లిస్ (బి) జంపా 5; జితేశ్ (ఎల్బీ) (బి) జంపా 3; సుందర్ (సి) (సబ్) కునెమన్ (బి) ఎలిస్ 12; అక్షర్ పటేల్ (నాటౌట్) 21; అర్ష్దీప్ (సి) ఫిలిప్ (బి) స్టొయినిస్ 0; వరుణ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–56, 2–88, 3–121, 4–125, 5–131, 6–136, 7–152, 8–164. బౌలింగ్: డ్వార్‌షుయిస్ 4–0–31–0, బార్త్‌లెట్ 4–0–26–1, ఎలిస్ 4–0–21–3, స్టొయినిస్ 4–0–41–1, జంపా 4–0–45–3.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: మార్ష్ (సి) అర్ష్దీప్ (బి) దూబే 30; షార్ట్ (ఎల్బీ) (బి) అక్షర్ 25; ఇన్‌గ్లిస్ (బి) అక్షర్ 12; డేవిడ్ (సి) సూర్యకుమార్ (బి) దూబే 14; ఫిలిప్ (సి) వరుణ్ (బి) అర్ష్దీప్ 10; స్టొయినిస్ (ఎల్బీ) (బి) సుందర్ 17; మ్యాక్స్‌వెల్ (బి) వరుణ్ 2; డ్వార్‌షుయిస్ (బి) బుమ్రా 5; బార్త్‌లెట్ (సి అండ్ బి) సుందర్ 0; ఎలిస్ (నాటౌట్) 2; జంపా (సి) గిల్ (బి) సుందర్ 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 119. వికెట్ల పతనం: 1–37, 2–67, 3–70, 4–91, 5–98, 6–103, 7–116, 8–116, 9–118, 10–119. బౌలింగ్: అర్ష్దీప్ 3–0–22–1, బుమ్రా 4–0–27–1, వరుణ్ 4–0–26–1, అక్షర్ 4–0–20–2, దూబే 2–0–20–2, సుందర్ 1.2–0–3–3.


