కాకమిగహారా (జపాన్): ఆసియా కప్ అండర్–18 హాకీ టోర్నమెంట్‌లో భారత పురుషుల జట్టు శుక్రవారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టును ‘ఢీ’కొంటుంది. సెమీఫైనల్లో స్థానం కోసం ఈ రెండు జట్లు నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో తలపడనున్నాయి.
ఐదు జట్లున్న పూల్ ‘ఎ’లో భారత జట్టు తొమ్మిది పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. నాలుగు జట్లున్న పూల్ ‘బి’లో పాకిస్తాన్ ఆరు పాయింట్లతో ‘టాపర్’గా నిలిచింది.
జపాన్ వేదికగా తొలుత కజకిస్తాన్‌పై 13-0తో ఏక పక్ష విజయం సాధించిన భారత్.. ఆతిథ్య జట్టు చేతిలో 4-2 తేడాతో ఓడిపోయింది. అనంతరం కొరియాతో మ్యాచ్‌లో తిరిగి పుంజుకున్న భారత జట్టు.. 4-1 తేడాతో గెలిచింది. ఆ తర్వాత చైనీస్ తైపీపై 13-1 తేడాతో గెలుపొందింది.
మరోవైపు.. భారత మహిళా హాకీ యువ జట్టు సైతం సెమీస్‌కు చేరుకుంది. తొలుత మలేషియాపై 2-1తో గెలిచిన భారత్.. కొరియాపై 3-1, సింగపూర్‌పై 25-0తో జయభేరి మోగించింది. సెమీ ఫైనల్లో భాగంగా భారత మహిళల జట్టు శుక్రవారం చైనాతో తలపడనుంది.


