Ashes 5th Test ENG Vs AUS Highlights: England Beats Australia By 49 Runs, Check Score Details Inside - Sakshi
Sakshi News home page

ENG Vs AUS 5th Test: ఆఖరి మజిలీలో ఇంగ్లండ్‌దే విక్టరీ.. విజయంతో బ్రాడ్‌ విడ్కోలు

Published Tue, Aug 1 2023 7:21 AM

Ashes 5t test: England beats Australia by 49 runs - Sakshi

లండన్‌: సంప్రదాయ క్రికెట్‌లో యాషెస్‌ సిరీస్‌కున్న ప్రత్యేకత, విశిష్టత ఇంకే సిరీస్‌కు ఎందుకు ఉండదో తాజా సిరీస్‌లో ఏ ఒక్క మ్యాచ్‌ చూసిన ఇట్టే అర్థమవుతుంది. టెస్టు సమరం ఐదు రోజులు ఆసక్తి కరంగానే మొదలైంది. ఐదు టెస్టులూ రసవత్తరంగానే జరిగాయి. గెలిచినా... ఓడినా... ఫలితంతో సంబంధంలేకుండా ఇంగ్లండ్‌ ఈ సిరీస్‌ అసాంతం వన్డేను తలపించే దూకుడునే కొనసాగించింది. ఇక ఈ ఐదో టెస్టు చివరి మజిలీలో వర్షం కూడా ‘యాషెస్‌’ విశిష్టత ముందు తోకముడిచింది. ఆఖరి రోజు ఆటలో క్లైమాక్స్‌కు సరిపడా మలుపులిచ్చి... ఇరు జట్లను ఊరించి మరీ సిరీస్‌ను పంచింది.  

ఆసీస్‌ను నడిపించి... ఇంగ్లండ్‌ను గెలిపించి... 
ఆఖరి రోజు 384 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్‌నైట్‌ స్కోరు 135/0తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా 94.4 ఓవర్లలో 334 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్లు వార్నర్‌ (60; 9 ఫోర్లు), ఖ్వాజా (72; 8 ఫోర్లు) స్వల్ప వ్యవధిలోనే అవుటయ్యారు. కానీ స్మిత్‌ (54; 9 ఫోర్లు), ట్రావిస్‌ హెడ్‌ (43; 6 ఫోర్లు) కలిసి నాలుగో వికెట్‌ కు 95 పరుగుల జోడించడంతో ఆసీస్‌ ఆశలు పెంచుకుంది.

టీ సెషన్‌లో 238/3 స్కోరుతో ఇంగ్లండ్‌ను కంగారు పెట్టిన ఆసీస్‌కు... హెడ్, స్మిత్, మార్ష్ (6), స్టార్క్‌ (0), కెప్టెన్‌ కమిన్స్‌ (9) వికెట్లను 300 పరుగుల్లోపే కోల్పోవడంతో ఓటమి ఖాయమైంది. బ్రాడ్‌ కెరీర్‌ ఆఖరి టెస్టులో ఆఖరి వికెట్‌గా క్యారీ (28; 1 ఫోర్, 1 సిక్స్‌)ని అవుట్‌ చేయడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌కు 334 స్కోరువద్ద తెరపడింది.

ఐదో టెస్టులో 49 పరుగులతో గెలిచిన ఇంగ్లండ్‌ సిరీస్‌ను 2–2తో సమం చేసుకుంది. అయితే గత సిరీస్‌ను గెలిచిన ఆసీస్‌ వద్దే ‘యాషెస్‌’       ఉండిపోనుంది. 2 వికెట్లతో బ్రాడ్‌ తన కెరీర్‌కు చిరస్మరణీయ ముగింపు ఇచ్చుకున్నాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వోక్స్‌ 4, మొయిన్‌ అలీ 3 వికెట్లు తీశారు. వోక్స్, స్టార్క్‌లకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు లభించాయి. తదుపరి యాషెస్‌ సిరీస్‌ ఆస్ట్రేలియాలో 2025–2026లో జరుగుతుంది.
చదవండి: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియాకు కొత్త కెప్టెన్‌, రింకూ సింగ్‌కు పిలుపు

Advertisement
Advertisement