
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ-2025లో టీమిండియా పేసర్ టెస్టు అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. కానీ ఈ యువ పేసర్ మాత్రం అన్ని మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. తొలి మూడు టెస్టులకు జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాష్ దీప్ వంటి ప్రధాన పేసర్లు అందుబాటులో ఉండడంతో అర్ష్‌దీప్‌కు అవకాశం దక్కలేదు.
అయితే మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టుకు ముందు ఆకాష్ దీప్ గాయపడడంతో అర్ష్‌దీప్‌కు ఛాన్స్ ఇవ్వాలని టీమ్ మెనెజ్‌మెంట్ భావించింది. దురదృష్టవశాత్తూ ప్రాక్టీస్ సమయంలో అర్ష్‌దీప్ చేతికి వేలికి గాయమైంది. అతడి స్ధానంలో అనూహ్యంగా అన్షుల్ కాంబోజ్‌కు తుది జట్టులో దక్కింది.
ఆ తర్వాత అతడు గాయం కారణంగా ఆఖరి టెస్టు టీమ్ సెలక్షన్‌కు కూడా అందుబాటులో లేడు. ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు బౌలింగ్ కోచ్ గంగన్‌దీప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి మూడు మ్యాచ్‌లలో అర్ష్‌దీప్‌ను ఏదో ఒక దాంట్లో అతడిని ఆడించాల్సిందని గగన్‌దీప్ అభిప్రాయపడ్డాడు.
"ఇంగ్లండ్ టూర్‌లో అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం ఇచ్చి ఉండాల్సింది. అతడొక అద్బుతమైన బౌలర్. ఇంగ్లండ్ కండీషన్స్ అతడి బౌలింగ్‌కు సరిగ్గా సరిపోతాయి. కొన్ని నెలల క్రితం అతడిని నేను ఇంగ్లండ్‌లో కలిశాను. టెస్టు జట్టులో అవకాశం రాకపోవడంతో అర్ష్‌దీప్ కాస్త అసహనంగా ఉన్నాడు. దీంతో నీకంటూ ఓ టైమ్ వస్తుంది, కాస్త ఓపిక పట్టు అని నేను అతడితో చెప్పాను.
మిగితా ఫార్మాట్లతో పోలిస్తే టెస్టు క్రికెట్ చాలా భిన్నంగా ఉంటుంది. మన నైపుణ్యాలను ఈ ఫార్మాట్ పరీక్షస్తుంది. అర్ష్‌దీప్‌కు ఉన్న బౌలింగ్ స్కిల్స్ రెడ్‌బాల్ క్రికెట్‌కు సరిపోతాయి. అతడికి బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే సత్తా ఉంది. త్వరలోనే అతడికి టెస్టుల్లో ఆడే అవకాశం లభిస్తుందని" గంగన్‌దీప్ ది హిందూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
కాగా వన్డే, టీ20ల్లో భారత తరపున అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్.. టెస్టుల్లో మాత్రం ఇంకా డెబ్యూ చేయలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రెగ్యూలర్‌గా ఆడుతున్నప్పటికి టీమిండియా తరపున టెస్టుల్లో ఆడే అవకాశం మాత్రం సింగ్‌కు రాలేదు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 21 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్.. 66 వికెట్లు పడగొట్టాడు. గత రంజీ సీజన్‌లో అతను రెండు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు.
చదవండి: KCL: సంజూ శాంసన్ విధ్వంసం.. 16 బంతుల్లోనే! వీడియో వైరల్