
ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన పాకిస్తాన్ జట్టులో విధ్వంసకర బ్యాటర్ ఉస్మాన్ ఖాన్‌కు చోటు దక్కలేదు. ఫామ్‌లేమి కారణంగా పాక్ సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టారు. ఆసియా కప్ కోసం ఎంపిక చేయకపోవడాన్ని అవమానంగా భావించిన ఉస్మాన్ ఖాన్.. దేశవాలీ టీ20 టోర్నీలో తన ప్రతాపాన్ని చూపించాడు.
ఘనీ రాయల్ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ టోర్నీలో వైటల్ టీ జట్టుకు ఆడుతున్న ఖాన్.. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 69 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 138 పరుగులు చేశాడు. ఫలితంగా అతని జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఈ భారీ లక్ష్యాన్ని సునాయాసంగా కాపాడుకుంది.
కాగా, ఉస్మాన్ ఖాన్‌కు పాక్ క్రికెట్ బోర్డు ఈ మధ్యకాలంలోనే మరో షాక్ కూడా ఇచ్చింది. ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తొలగించింది. ఖాన్ గతేడాది డి-కేటగిరిలో కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. పేలవ ఫామ్ కారణంగా ఖాన్ పీసీబీ తాజాగా కాంట్రాక్ట్‌ను కూడా కోల్పోయాడు.
పీసీబీ తమ స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్‌లను తమ అత్యున్నత కాంట్రాక్ట్ అయిన ఏ కేటగిరి నుంచి తప్పించి బి కేటగిరికి డిమోట్ చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో దారుణంగా విఫలమవుతున్న కారణంగా పీసీబీ ఏ ఒక్క పాక్ ఆటగాడికి కూడా ఏ కేటగిరి కేటాయించలేదు.
30 ఏళ్ల ఉస్మాన్ ఖాన్‌కు పాక్ దేశవాలీ క్రికెట్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. పీఎస్‌ఎల్ ద్వారా ఇతను భారీ హిట్టర్‌గా పేరు గడించాడు. అయితే ఖాన్‌కు పాక్ తరఫున పేలవమైన రికార్డు ఉంది. ఈ కుడి చేతి వాటం బ్యాటర్ తన దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ 19 టీ20ల్లో కేవలం 239 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క అర్ద సెంచరీ మాత్రమే ఉంది. పాక్ తరఫున 2 వన్డేలు కూడా ఆడిన ఖాన్.. ఇక్కడ కూడా విఫలమయ్యాడు.