
ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్, ఫాబ్ ఫోర్‌లో ముఖ్యుడు జో రూట్ గత కొన్నేళ్లుగా టెస్ట్‌ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఫాబ్ ఫోర్‌లో మిగతా ముగ్గురు (కోహ్లి, స్మిత్, కేన్) సహా ఈతరం బ్యాటర్లలో ఎవ్వరూ ఈ మధ్యకాలంలో రూట్ జోరును అందుకోలేకపోతున్నారు. 2021 ముందు వరకు ఓ మోస్తరుగా సాగిన రూట్ కెరీర్.. ఆ ఏడాది నుంచి కట్టలు తెంచుకుంది.
అప్పటివరకు 17 టెస్ట్ సెంచరీలు మాత్రమే చేసిన రూట్.. ఈ ఐదేళ్లలో ఏకంగా 22 శతకాలు బాదాడు. ఈ క్రమంలో టెస్ట్‌ల్లో మెజార్టీ రికార్డులను బద్దలు కొట్టాడు. ప్రస్తుతం టెస్ట్‌ల్లో రూట్ ముందున్న ప్రధాన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక టెస్ట్ పరుగుల రికార్డు. ఈ రికార్డుకు రూట్ మరో 3000 పైచిలుకు పరుగుల దూరంలో ఉన్నాడు.
టెస్ట్‌ల్లో హవా కొనసాగిస్తూనే రూట్ ఈ మధ్యకాలంలో వన్డేల్లోనూ సత్తా చాటుతున్నాడు. ఈ ఏడాది రూట్ వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్‌పై అద్భుత శతకాలు బాదాడు. అప్పటివరకు వన్డేల్లో తన పని అయిపోయిందన్న వారికి రూట్ వరుస సెంచరీలతో సమాధానం చెప్పాడు. టెస్ట్‌ల్లో, వన్డేల్లో సత్తా చాటుతున్నా రూట్ పొట్టి క్రికెట్‌కు పనికి రాడన్న అపవాదు మాత్రం నిన్నమొన్నటి వరకు ఉండింది.
అయితే దీన్ని కూడా రూట్ అధిగమించడం మొదలుపెట్టాడు. ఇటీవలే భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉండిన రూట్.. అదే ఫామ్‌ను ప్రస్తుతం ఇంగ్లండ్‌లోనే జరుగుతున్న ద హండ్రెడ్ లీగ్‌లోనూ కొనసాగిస్తున్నాడు. ఈ లీగ్ తొలి మ్యాచ్‌ల్లో తేలిపోయిన రూట్.. ఆతర్వాత వరుస మ్యాచ్‌ల్లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో ఇరగదీశాడు.
ఆగస్ట్ 21న ఓవల్ ఇన్విన్సిబుల్స్‌పై 41 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్ సాయంతో 76 పరుగులు చేసిన రూట్.. తాజాగా వెల్ష్ ఫైర్‌పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో రూట్ 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 64 పరుగులు చేసి తన జట్టును నాకౌట్‌కు కూడా చేర్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో రూట్‌లోని భారీ హిట్టర్ కోణం బయటపడింది. సహజంగా గ్రౌండ్ స్ట్రోక్స్ మాత్రమే ఆడే రూట్.. ఈ మ్యాచ్‌లో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.