అర్జున్‌ టెండూల్కర్‌కు ఘోర అవమానం | Arjun Tendulkar Insulted By LSG Teammate On His Debut In IPL 2026 | Sakshi
Sakshi News home page

అర్జున్‌ టెండూల్కర్‌కు ఘోర అవమానం

May 24 2026 1:46 PM | Updated on May 24 2026 1:55 PM

Arjun Tendulkar Insulted By LSG Teammate On His Debut In IPL 2026

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కొడుకు అర్జున్‌ టెండూల్కర్‌కు ఐపీఎల్‌ 2026లో ఎట్టకేలకు ఓ అవకాశం దొరికింది. నిన్న (మే 23) పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌తో అర్జున్‌ లక్నో తరఫున అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో అతడు బంతితో ఆక​ట్టుకున్నా, బ్యాటింగ్‌ సమయంలో సహచరుడి నుంచి ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నాడు.

లక్నో ఇన్నింగ్స్‌ చివర్లో (17.6వ ఓవర్‌) ముకుల్‌ చౌదరి ఔటైన అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన అర్జున్‌కు, ఆ సమయంలో మరో ఎండ్‌లో ఉన్న అబ్దుల్‌ సమద్‌ ఉద్దేశపూర్వకంగా స్ట్రయిక్‌ ఇవ్వలేదు. అప్పటికే అర్జున్‌ నిదానంగా ఆడుతున్నాడని భావించిన సమద్‌.. చివరి ఓవర్‌లో మూడు బంతులు వృధా చేసి కూడా అర్జున్‌కు స్ట్రయిక్‌ ఇచ్చేందుకు నిరాకరించాడు.

ఈ ఉదంతకం వెంటనే సోషల్‌మీడియాలో వైరలైంది. సమద్‌కు స్వార్దపరుడని కొందరు.. కరెక్ట్‌గానే చేశాడని మరికొందరు అభిప్రాయపడ్డాడు. వాస్తవానికి అర్జున్‌కు స్ట్రయిక్‌ ఇవ్వకపోయినా సమద్‌ తన పాత్రకు న్యాయం చేశాడు. చివరి ఓవర్‌ తొలి మూడు బంతులకు పరుగులు సాధించలేకపోయినా, వైడ్లు పక్కకు పెటి,​ చివరి మూడు అధికారిక బంతులకు 6, 4, 4 పరుగులు చేశాడు. సమద్‌ అర్జున్‌కు స్ట్రయిక్‌ ఇవ్వకపోవడం వల్లనే లక్నో ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్‌ (196-6) చేయగలిగింది.

అనంతరం ఇన్నింగ్స్‌ 7వ ఓవర్‌లో బంతిని అందుకున్న అర్జున్‌ తొలి ఓవర్‌లోనే ఆకట్టుకున్నాడు. అప్పటికే మంచి టచ్‌లో ఉండిన శ్రేయస్‌, ప్రభ్‌సిమ్రన్‌ను కంట్రోల్‌ చేసి కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో తన కోటా 4 ఓవర్లు పూర్తి చేసిన అర్జున్‌.. భీకర ఫామ్‌లో ఉన్న ప్రభ్‌సిమ్రన్‌ వికెట్‌ తీసి కేవలం 36 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 

శ్రేయస్‌ సూపర్‌ శతకం కారణంగా ఈ మ్యాచ్‌లో లక్నో ఓడినా అర్జున్‌ ప్రదర్శన మాత్రం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. బ్యాటింగ్‌ సమయంలో స్ట్రయిక్‌ దక్కలేదన్న విషయం మినహా వ్యక్తిగతంగా ఈ మ్యాచ్‌ అర్జున్‌కు అన్నీ తీపి గుర్తులే మిగిల్చింది. 

ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు బెంచ్‌కే పరిమితమైన అర్జున్‌, లభించిన ఏకైక అవకాశాన్ని  సద్వినియోగం చేసుకొని తదుపరి సీజన్‌కు బాటలు వేసుకున్నాడు. గత సీజన్‌ వరకు ముంబై ఇండియన్స్‌తో ఉండిన అర్జున్‌ను ఈ సీజన్‌ వేలంలో లక్నో రూ. 30 లక్షల బేస్‌ ధరకు సొంతం చేసుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement