అటు అర్జెంటీనా ఇటు ఇరాన్‌ | Argentina and Iran qualify for the World Cup football tournament | Sakshi
Sakshi News home page

అటు అర్జెంటీనా ఇటు ఇరాన్‌

Mar 27 2025 4:02 AM | Updated on Mar 27 2025 4:02 AM

Argentina and Iran qualify for the World Cup football tournament

ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌కు క్వాలిఫై

బ్రెజిల్‌పై 4–1తో గెలుపొందిన అర్జెంటీనా

బ్యూనస్‌ ఎయిర్స్‌: తమ కెప్టెన్‌... దిగ్గజ ప్లేయర్‌ లయోనల్‌ మెస్సీ లేకపోయినా... అర్జెంటీనా జోరు తగ్గించలేదు. ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్‌ జట్టును అలవోకగా ఓడించిన అర్జెంటీనా దర్జాగా ప్రపంచకప్‌ టోర్నమెంట్‌కు 19వసారి అర్హత సాధించింది. దక్షిణ అమెరికా జోన్‌ నుంచి ప్రపంచకప్‌ టోర్నీకి ఆరు జట్లకు నేరుగా అర్హత పొందే అవకాశం ఉంది. తొలి బెర్త్‌ను డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనా జట్టు సొంతం చేసుకుంది. వాస్తవానికి బ్రెజిల్‌ జట్టుతో మ్యాచ్‌కు ముందే అర్జెంటీనాకు వరల్డ్‌కప్‌ బెర్త్‌ ఖరారైంది. 

ఉరుగ్వే జట్టుతో మ్యాచ్‌ను బొలీవియా జట్టు 0–0తో ‘డ్రా’ చేసుకోవడంతో అర్జెంటీనాకు ప్రపంచకప్‌ బెర్త్‌ లభించింది. ఫలితంతో సంబంధం లేకుండా వరల్డ్‌కప్‌ బెర్త్‌ దక్కడంతో... బ్రెజిల్‌తో జరిగిన పోరులో అర్జెంటీనా అదరగొట్టింది. మెస్సీ గైర్హాజరీలో నికోలస్‌ ఒటామెండీ సారథ్యంలో బరిలోకి దిగిన అర్జెంటీనా 4–1 గోల్స్‌ తేడాతో బ్రెజిల్‌ను చిత్తుగా ఓడించింది. అర్జెంటీనా తరఫున జూలియన్‌ అల్వారెజ్‌ (4వ నిమిషంలో), ఎంజో ఫెర్నాండెజ్‌ (12వ నిమిషంలో), అలెక్సిస్‌ మాక్‌ అలిస్టర్‌ (37వ నిమిషంలో), గిలియానో సిమోన్‌ (71వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. 

బ్రెజిల్‌ జట్టుకు మాథ్యూస్‌ కున్హా (26వ నిమిషంలో) ఏకైక గోల్‌ అందించాడు.  దక్షిణ అమెరికా జోన్‌ నుంచి మొత్తం 10 జట్లు (అర్జెంటీనా, ఈక్వెడార్, ఉరుగ్వే, బ్రెజిల్, పరాగ్వే, కొలంబియా, వెనిజులా, బొలీవియా, పెరూ, చిలీ) డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో పోటీపడుతున్నాయి. ఒక్కో జట్టు మిగతా జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది.

ఇప్పటి వరకు 14 రౌండ్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం అర్జెంటీనా 31 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరో ఐదు బెర్త్‌లు ఖరారు కావాల్సి ఉన్నాయి. ఏడో స్థానంలో నిలిచిన జట్టుకు ‘ప్లే ఆఫ్‌’ మ్యాచ్‌ ద్వారా ప్రపంచకప్‌కు అర్హత పొందే అవకాశం లభిస్తుంది. 

ఇరాన్‌ వరుసగా నాలుగోసారి... 
మరోవైపు ఆసియా జోన్‌ నుంచి ఇరాన్‌ జట్టు వరుసగా నాలుగోసారి ప్రపంచకప్‌ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. ఉజ్బెకిస్తాన్‌ జట్టుతో జరిగిన మూడో రౌండ్‌ గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌ను ఇరాన్‌ జట్టు 2–2తో ‘డ్రా’ చేసుకుంది. 1978లో తొలిసారి ప్రపంచకప్‌లో ఆడిన ఇరాన్‌ ఆ తర్వాత 1998లో రెండోసారి ఈ మెగా ఈవెంట్‌లో పోటీపడింది. 2006లో మూడోసారి ప్రపంచకప్‌లో ఆడిన ఇరాన్‌ 2010లో జరిగిన ప్రపంచకప్‌కు అర్హత సాధించలేదు. 

2014లో నాలుగోసారి వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగిన ఇరాన్‌ ఆ తర్వాత 2018లో, 2022లోనూ పోటీపడింది. ఈసారి మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఓవరాల్‌గా ఏడోసారి ప్రపంచకప్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 2026 ప్రపంచకప్‌ టోర్నీకి అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తొలిసారి 48 జట్లు ప్రపంచకప్‌లో ఆడనున్నాయి. 

ఆసియా నుంచి 8 జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. ప్లే ఆఫ్‌ టోర్నీ ద్వారా మరో జట్టుకు అర్హత పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మూడు (అమెరికా, కెనడా, మెక్సికో) ఆతిథ్య దేశాలతోపాటు జపాన్, ఇరాన్, న్యూజిలాండ్, అర్జెంటీనా జట్లు వరల్డ్‌కప్‌కు అర్హత పొందాయి. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీతో క్వాలిఫయింగ్‌ ప్రక్రియ పూర్తవుతుంది.

19 ప్రపంచకప్‌ టోర్నీకి ఇప్పటి వరకు అర్జెంటీనా 19 సార్లు అర్హత సాధించింది. మూడుసార్లు (1978, 1986, 2022) విజేతగా నిలిచింది. మరో మూడుసార్లు (1930, 1990, 2014) ఫైనల్లో ఓడి రన్నరప్‌తో సంతృప్తి పడింది. ఐదుసార్లు క్వార్టర్‌ ఫైనల్లో... నాలుగుసార్లు గ్రూప్‌ దశలో... మూడుసార్లు ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement