
క్రికెట్‌లో రాణిస్తున్న జిల్లా వాసులు
భారత మహిళా క్రికెట్ జట్టులో అనూష
ఇప్పటికే పలువురు రంజీ జట్టుకు ప్రాతినిథ్యం
తాజాగా దూసుకొస్తున్న మరికొందరు
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజల అభిమాన క్రీడగా మారిన క్రికెట్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు రాణిస్తున్నారు. సాధారణంగా విధ్వంస రచన చేసే టీ20 ఫార్మాట్‌లో విజయాన్ని శాసించే స్థాయికి బౌలర్లు ఎదిగారు. గెలుపే ఆకాంక్షగా బ్యాటింగ్ బరిలో దిగితే పరుగుల వర్షం కురిపిస్తున్నారు.
అనంతపురం: ప్రపంచ వ్యాప్తంగా యమ క్రేజీ ఉన్న క్రికెట్‌లో అనంతపురం జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరుస్తూ రంజీ, దేశవాళీ టోరీ్నల్లో రాణిస్తున్నారు. ఏపీఎల్ (ఆంధ్ర ప్రీమియర్ లీగ్) లోనూ అదరగొడుతున్నారు. పురుషులే కాదు ..మహిళలు కూడా తాము ఎందులోనూ తీసిపోమని సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా ఆర్డీటీ అందిస్తున్న శిక్షణతో రాటు దేలిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా చాటుతున్నారు.
దత్తా.. సాటిలేని సత్తా
ఆంధ్రా తరపున అండర్–19 విభాగంలో హర్యానాపై మచ్చా దత్తారెడ్డి ఏకంగా 172 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. మణిపూర్‌పై 105 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా ప్రతిభ కనబరుస్తున్నాడు. అండర్–23లో గోవాపై 102 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఏపీఎల్‌లోనూ రాణించాడు. కుడిచేతి ఓపెనింగ్ బ్యాట్స్ మెన్‌గా సత్తా చాటుతున్నాడు.
బాల్ వేస్తే.. వికెట్ గిరగిరా..
గిరినాథరెడ్డి మంచి ఆల్‌రౌండర్. అండర్–25 విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించాడు. ఏపీఎల్‌లో రాయలసీమ కింగ్స్ జట్టుకు కెపె్టన్‌గా ఉన్నాడు. కుడిచేతి బ్యాట్స్‌మెన్, మీడియం పేస్ బౌలింగ్‌తో ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. అండర్–23లో మధ్యప్రదేశ్ జట్టుపై 7 వికెట్లు తీసిన రికార్డు ఉంది. శ్రీసత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన గిరినాథరెడ్డి మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు.
మల్లి బౌలింగ్‌తో ప్రత్యర్థి బెంబేలు
రాప్తాడుకు చెందిన మల్లికార్జున ఎడమ చేతి స్పిన్నర్. ఆంధ్ర తరపున అండర్–16లో సిక్కింపై 8, గోవాపై 7 వికెట్లు కూలదోశాడు. అండర్–19 కేటగిరిలో బెంగాల్‌పై 7 వికెట్లు తీసి ఉత్తమ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. బీసీసీఐ అండర్–16 టోరీ్నలో అత్యధికంగా 38 వికెట్లు తీసిన రెండో క్రీడాకారుడిగా ఖ్యాతి దక్కించుకున్నాడు. ఏపీఎల్‌లోనూ రాణిస్తున్నాడు.
‘ప్రశాంత’ంగా ఆడేస్తూ..
డీబీ ప్రశాంత్‌కుమార్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో సెంచరీ సాధించాడు. రంజీ ట్రోఫీలో 85 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌పై ఆడిన మ్యాచ్‌లో 189 పరుగులు సాధించాడు. కుడిచేతి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అయిన డీబీ ప్రశాంత్‌కుమార్ బరిలో ఉన్నంత సేపూ ప్రశాంతంగా ఆడుతూ ప్రత్యర్థి జట్టు విజయాకాశాలను దెబ్బ తీయడంలో దిట్టగా పేరుగాంచాడు.
అర్జున్.. రన్ మెషీన్
కుడిచేతి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా అర్జున్ టెండూల్కర్ సత్తా చాటుతున్నాడు. అండర్ –19 , అండర్–23 కేటగిరిలో రాణించాడు. సీనియర్ వన్డే అంతర జిల్లా టోరీ్నలో 127 పరుగులు సాధించాడు. రెండు అర్ధసెంచరీలు చేశాడు. కుడి చేతి ఆఫ్ స్పిన్నర్‌గా ఆల్‌రౌండర్ ప్రతిభ చాడుతున్న అర్జున్ టెండుల్కర్ స్వగ్రామం ధర్మవరం మండలం గొట్లూరు గ్రామం.
బౌలింగ్ మాయాజాలం
కురుగుంట గ్రామానికి చెందిన ఎలక్ట్రికల్ డైలీ వర్కర్ రవి, ఆయన భార్య నారాయణమ్మ తాము పడుతున్న కష్టం తమ బిడ్డ వినయ్‌కుమార్ పడకూడదని భావించారు. చదువుతో పాటు క్రికెట్‌లోనూ శిక్షణ ఇప్పించారు. వారి నమ్మకాన్ని వినయ్‌కుమార్ వమ్ము చేయలేదు. 2013 నుంచి 2017 వరకు అనంతపురం క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. ఆర్డీటీ కోచ్‌లు నరే‹Ù, ఆర్.కుమార్ వద్ద మెలకువలు నేర్చుకుని, అండర్–19, 23, 25 టోరీ్నలతో పాటు రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్లోనూ తిరుగులేని ప్రతిభను చాటాడు. తన బౌలింగ్ మాయాజాలంతో హజరా ట్రోపీలో ఏకంగా 6 వికెట్లు తీసి సత్తా చాటాడు.