Umpire Aleem Dar: 19 ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు పలికిన దిగ్గజ అంపైర్‌

Aleem Dar Ends 19-year Old Career As Elite Panel Umpire - Sakshi

దిగ్గజ అంపైర్‌ అలీమ్‌ దార్‌ తన 19 ఏళ్ల అంపైరింగ్‌ కెరీర్‌కు గురువారం వీడ్కోలు పలికాడు. పాకిస్తాన్‌కు చెందిన 54 ఏళ్ల అలీమ్‌ దార్‌ ఐసీసీ ఎలైట్‌ ప్యానెల్‌ అంపైర్‌గా విధులు నిర్వర్తించారు. దిగ్గజ అంపైర్‌గా పేరు పొందిన ఆయన రికార్డు స్థాయిలో 435 అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైరింగ్‌ చేశారు. ఇందులో 2007, 2011 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌తో పాటు 2010, 2012 టి20 వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌ కూడా ఉన్నాయి.

2000లో అంపైర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అలీమ్‌దార్‌ పాకిస్తాన్‌ నుంచి ఐసీసీ ఎలైట్‌ ప్యానెల్‌ అంపైరింగ్‌ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న వ్యక్తిగా నిలిచిపోయారు. మొత్తంగా 435 మ్యాచ్‌ల్లో 222 వన్డేలు, 144 టెస్టులు, 69 టి20 మ్యాచ్‌ల్లో అంపైరింగ్‌ నిర్వహించారు. ఇక ఐదు వన్డే వరల్డ్‌కప్‌, ఏడు టి20 వరల్డ్‌కప్స్‌కు అంపైర్‌గా పనిచేశారు. 2009, 2010, 2011లో వరుసగా మూడుసార్లు డేవిడ్‌ షెపర్డ్‌ ట్రోఫీ(ఐసీసీ అంపైర్‌ ఆఫ్‌ ది ఇయర్‌)ని గెలుచుకోవడం విశేషం.

అంపైరింగ్‌ కెరీర్‌కు వీడ్కోలు పలకడంపై అలీమ్‌ దార్‌ స్పందిస్తూ.. ''అంపైర్‌గా లాంగ్‌ జర్నీని బాగా ఎంజాయ్‌ చేశాడు. ఒక అంపైర్‌గా నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి పేరు తెచ్చుకోవడం గౌరవంగా భావిస్తున్నా. అంపైరింగ్‌ కెరీర్‌ను ప్రారంభించిన కొత్తలో ఈ స్థాయికి చేరుకుంటానని కలలో కూడా ఊహించలేదు.

మూడుసార్లు ఐసీసీ అంపైర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు గెలుచుకోవడం నా కెరీర్‌లోనే పెద్ద అచీవ్‌మెంట్‌. 19 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. ఇప్పుడున్న అంపైర్లకు నా సలహా ఏంటంటే.. కష్టపడండి, మర్యాదగా నడుచుకోండి..కొత్త విషయాలను నేర్చుకోవడం ఎప్పటికి ఆపకండి'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఐసీసీ తమ ఎలైట్‌ ప్యానెల్‌ అంపైరింగ్‌ సభ్యులను 12కు పెంచింది. 

ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్లు: క్రిస్ గఫానీ (న్యూజిలాండ్), కుమార్ ధర్మసేన (శ్రీలంక), మరైస్ ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా), మైకేల్ గోఫ్ (ఇంగ్లండ్), నితిన్ మీనన్ (భారత్), పాల్ రీఫిల్ (ఆస్ట్రేలియా), రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లండ్) , రిచర్డ్ కెటిల్‌బరో (ఇంగ్లాండ్), రోడ్నీ టక్కర్ (ఆస్ట్రేలియా), జోయెల్ విల్సన్ (వెస్టిండీస్), అడ్రియన్ హోల్డ్‌స్టాక్ (దక్షిణాఫ్రికా) మరియు అహ్సన్ రజా (పాకిస్థాన్).

చదవండి: సంచలనం.. క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన గాయత్రి–ట్రెసా జోడీ 

క్రికెట్‌పై అభిమానం.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top