
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ అలనా కింగ్ (Alana King) సరికొత్త చరిత్ర లిఖించింది. మహిళల వన్డే క్రికెట్‌లో పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అర్ధ శతకం సాధించిన తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సాధించింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC World Cup)లో భాగంగా కొలంబోలో పాకిస్తాన్‌తో బుధవారం నాటి మ్యాచ్ సందర్భంగా అలనా కింగ్ ఈ ఫీట్ నమోదు చేసింది.
చాంపియన్లకు తిరుగు ఉంటుందా?
క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఏమాత్రం బెదరకుండా ఎలా నిలవాలో... ప్రత్యర్థులు పరీక్ష పెడుతున్నా నమ్మకం కోల్పోకుండా ఎలా పోరాడాలో... ఓటమి మేఘాలు కమ్ముకున్నప్పుడు వెలుగుల బాట ఎలా వేసుకోవాలో... ఆస్ట్రేలియా క్రికెట్ జట్లకు బాగా తెలుసని మరోసారి నిరూపితమైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో పోరులో ప్రతికూల పరిస్థితులను తిప్పికొడుతూ ఆసీస్ ఘనవిజయం సాధించింది.
మూనీ సూపర్ సెంచరీ.. అలనా మెరుపు అర్ధ శతకం
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బెత్ మూనీ (Beth Mooney- 114 బంతుల్లో 109; 11 ఫోర్లు) ఆణిముత్యం అనదగ్గ సెంచరీతో కదంతొక్కడంతో... బుధవారం జరిగిన ఈ పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా జట్టు 107 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది.
ఆసీస్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి వర్షం కారణంగా రద్దుకాగా... మిగిలిన రెండిట్లో గెలిచి 5 పాయింట్లతో అగ్రస్థానానికి చేరింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.
బెత్ మూనీ అసాధారణ ఇన్నింగ్స్‌కు టెయిలెండర్ అలానా కింగ్ (49 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు హాఫ్‌సెంచరీ తోడవడంతో ఆసీస్ మెరుగైన స్కోరు చేయగలిగింది. ఒకదశలో 76 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఆసీస్‌ను మూనీ ఆదుకుంది.
కిమ్‌గార్త్ (11)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 39 పరుగులు జోడించిన మూనీ... తొమ్మిదో వికెట్‌కు అలానాతో 106 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. 77 పరుగులతో కిమ్ గార్త్– ఆష్లే గార్డ్‌నర్ జోడీ పేరిట ఉన్న రికార్డును మూనీ–కింగ్ జంట సవరించింది.
చిత్తుగా ఓడిన పాక్
పాకిస్తాన్ బౌలర్లు బంతిబంతికి పరీక్ష పెడుతున్నా... ఏమాత్రం వెరవకుండా పోరాటం కొనసాగించింది. క్రీజులో కుదురుకున్నాక కింగ్ భారీ షాట్‌లతో సహచరిపై ఒత్తిడి తగ్గించింది. కెప్టెన్ అలీసా హీలీ (20), లిచ్‌ఫీల్డ్ (10), ఎలీస్ పెర్రీ (5), అనాబెల్ (1), యాష్లే గార్డ్‌నర్ (1), తహిలా మెక్‌గ్రాత్ (5) విఫలమయ్యారు.
ఇక వన్డేల్లో ఐదో సెంచరీ పూర్తి చేసుకున్న మూనీ ఇన్నింగ్స్ చివరి బంతికి అవుటైంది. పాక్ బౌలర్లలో నష్రా సంధు 37 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... ఫాతిమా సనా, రమీన్ షమీమ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 36.3 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది.
సిద్రా అమీన్ (52 బంతుల్లో 35; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ ఫాతిమా సనా (11), సదాఫ్ (5), మునీబా అలీ (3), సిద్రా నవాజ్ (5), నటాలియా పర్వేజ్ (1), ఐమన్ ఫాతిమా (0) విఫలమయ్యారు. ఆ్రస్టేలియా బౌలర్లలో కిమ్ గార్త్ 3... మేగన్ షుట్, అనాబెల్ సదర్లాండ్ చెరో 2 వికెట్లు తీశారు.
అలనా కింగ్ అరుదైన ఘనత
పాక్‌తో మ్యాచ్‌లో 49 బంతులు ఎదుర్కొన్న స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అలనా కింగ్ మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 51 పరుగులతో అజేయంగా నిలిచింది. తద్వారా పదో స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన మహిళా ప్లేయర్‌గా రికార్డు సాధించింది.
అంతకు ముందు ఈ రికార్డు సౌతాఫ్రికాకు చెందిన యులాండి వాన్ డెర్ మెర్వే పేరిట ఉండేది. 2000 సంవత్సరంలో భారత మహిళా జట్టుతో మ్యాచ్ సందర్భంగా యులాండి పదో స్థానంలో వచ్చి 42 పరుగులు చేసింది.