ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. భార‌త తుది జ‌ట్టులో ఎవ‌రూ ఊహించ‌ని ప్లేయ‌ర్‌!? | Aakash Chopra picks probable India XI for first England Test | Sakshi
Sakshi News home page

IND vs ENG: ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. భార‌త తుది జ‌ట్టులో ఎవ‌రూ ఊహించ‌ని ప్లేయ‌ర్‌!?

May 16 2025 8:10 PM | Updated on May 16 2025 9:06 PM

Aakash Chopra picks probable India XI for first England Test

ఐపీఎల్‌-2025 సీజన్ ముగిసిన త‌ర్వాత భార‌త క్రికెట్ జ‌ట్టు ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నుంది. ఈ సిరీస్‌కు భార‌త జ‌ట్టును మే 23న బీసీసీఐ ప్ర‌క‌టించే అవకాశముంది.

అదేరోజున భార‌త కొత్త టెస్టు కెప్టెన్ పేరును కూడా బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ వెల్ల‌డించ‌నుంది. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిలు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డంతో యువ ఆట‌గాళ్ల‌తో కూడిన భార‌త జ‌ట్టు ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. సాయిసుద‌ర్శ‌న్‌, దేవ‌దత్ ప‌డిక్క‌ల్ వంటి యువ ఆట‌గాళ్ల‌కు టెస్టు జ‌ట్టులో చోటు ద‌క్కే అవ‌కాశ‌ముంది. 

జూన్ 20 నుంచి హెడింగ్లీ వేదిక‌గా ఇంగ్లండ్‌-భార‌త్ మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. డ‌బ్ల్యూటీసీ సైకిల్ 2025-27లో భార‌త్‌కు ఇదే తొలి సిరీస్. ఈ నేప‌థ్యంలో ఇంగ్లండ్‌తో మొద‌టి టెస్టుకు భార‌త ప్లేయింగ్ ఎలెవ‌న్‌ను మాజీ క్రికెట‌ర్ ఆకాష్ చోప్రా అంచనా వేశాడు.

రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డంతో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌కు చోప్రా అవ‌కాశ‌మిచ్చాడు. భార‌త ఇన్నింగ్స్‌ను య‌శ‌స్వి జైశ్వాల్‌, కేఎల్ రాహుల్ ప్రారంభించాల‌ని అత‌డు అభిప్రాయప‌డ్డాడు. అదేవిధంగా విరాట్ కోహ్లి స్ధానంలో సాయి సుద‌ర్శ‌న్ లేదా దేవ్‌ద‌త్త్ ప‌డిక్కల్‌కు అవ‌కాశ‌మివ్వాల‌ని ఆకాష్ చోప్రా అభిప్రాయ‌ప‌డ్డాడు. 

ఇక కెప్టెన్సీ రేసులో ఉన్న శుబ్‌మ‌న్ గిల్‌కు నాలుగో స్దానంలో అత‌డు చోటు క‌ల్పించాడు. వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌గా రిష‌బ్ పంత్‌ను ఈ భార‌త మాజీ క్రికెట‌ర్ ఎంపిక చేశాడు. ఆల్‌రౌండ‌ర్ కోటాలో నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజాల‌కు చోటిచ్చాడు.

అయితే అనూహ్యంగా దీప‌క్ చాహ‌ర్‌ను ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక చేయాల‌ని అత‌డు సెల‌క్ట‌ర్లను సూచించాడు. ఎనిమిదవ స్ధానంలో దీపక్ చాహర్ లేదా శార్ధూల్ ఠాకూర్‌కు ఛాన్స్ ఇవ్వాల‌ని అత‌డు మెనెజ్‌మెంట్‌ను కోరాడు. కాగా దీపక్‌ చాహర్‌ ఇప్పటివరకు టెస్టుల్లో భారత తరపున అరంగేట్రం చేయలేదు. ఇక ఫాస్ట్‌ బౌలర్ల కోటాలో జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణలకు చోప్రా చోటిచ్చాడు.

ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు చోప్రా ఎంపిక చేసిన ఇండియ‌న్ ప్లేయింగ్ ఎలెవ‌న్‌
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్/దేవ్‌దత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/దీపక్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ/ ప్రసిద్ద్‌ కృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement