Sunil Gavaskar 174-ball 36 Runs: జిడ్డు ఇన్నింగ్స్‌కు 47 ఏళ్లు.. కోపంతో లంచ్‌ బాక్స్‌ విసిరేసిన క్రికెట్‌ అభిమాని

47 Years Completed For Sunil Gavaskar 174 Balls-36-Runs Knock - Sakshi

భారత క్రికెట్ దిగ్గజం.. లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గావస్కర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెస్టుల్లో టీమిండియా తరపున 10వేల పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు టెస్టుల్లో 34 సెంచరీలు సాధించి అత్యధిక సెంచరీలు అందుకున్న ఆటగాడిగా(సచిన్‌ బ్రేక్‌ చేసేవరకు) నిలిచాడు. ఇక టెస్టుల్లో బెస్ట్‌ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌గా ఆల్‌టైమ్‌ జాబితాలో చోటు సంపాదించాడు. 1971-1987 వరకు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన గావస్కర్‌ లెక్కలేనన్ని రికార్డులు సాధించాడు. 

మరి అలాంటి గావస్కర్‌ తన కెరీర్‌లో ఒకే ఒక్కసారి జిడ్డు ఆటను ప్రదర్శించాడు. అదీ 1975లో జరిగిన తొలి వన్డే ప్రపంచకప్‌లో. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గావస్కర్‌ 174 బంతులాడి 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచి చరిత్రలో నిలిచిపోయాడు. గావస్కర్‌ ఆడిన జిడ్డు ఆట క్రికెట్‌ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయింది. గవాస్కర్ కెరీర్‌లోనే కాదు.. టీమిండియా చరిత్రలోనే ఓ విభిన్నమైన స్థానం దక్కించుకున్న ఆ ఇన్నింగ్స్‌కి నేటికి సరిగ్గా 47 ఏళ్లు... తాజాగా మరోసారి ఆ మ్యాచ్‌ను.. గావస్కర్‌ ఆటతీరుపై వచ్చిన విమర్శలు మరోసారి గుర్తుచేసుకుందాం.


1975లో క్రికెట్‌లో తొలి వన్డే వరల్డ్‌కప్‌ జరిగింది. ఈ టోర్నీలో  టీమిండియా ఇంగ్లండ్‌తో తమ​ తొలి మ్యాచ్‌ ఆడింది. టెస్టులకు బాగా అలవాటు పడ్డ టీమిండియాకు ఆ సమయంలో వన్డేల్లో ఎలా బ్యాటింగ్‌ చేయాలనేది కూడా తెలీదు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌.. నిర్ణీత 60 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 334 పరుగులు చేసింది. డెన్నిస్ అమీస్ 147 బంతుల్లో 18 ఫోర్లతో 137 పరుగులు చేయగా.. కీత్ ఫ్లెంచర్ 68, మైక్ డెన్నిస్ 37, క్రిస్ ఓల్డ్ 30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు సాధించారు.

335 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఏ దశలోనూ టార్గెట్‌ దిశగా సాగలేదు. 34 బంతుల్లో 8 పరుగులు చేసిన ఏక్‌నాథ్ సోల్కర్ అవుటైన తర్వాత అన్షుమాన్ గైక్వాడ్ 22, గుండప్ప విశ్వనాథ్ 59 బంతుల్లో 5 ఫోర్లతో 37 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన సునీల్‌ గావస్కర్‌ మాత్రం తన జిడ్డు ఆటతో అటు ప్రత్యర్థి జట్టును.. మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులను విసిగించాడు. 174 బంతులాడి 36 పరుగులు మాత్రమే చేసి చివరి వరకు నాటౌట్‌గా నిలిచిన గావస్కర్‌ను చూసి అభిమానులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది.


స్టేడియంలోనే సునీల్ గవాస్కర్‌ ఆటతీరుపై కొందరు అభిమానులు తమ నిరసనను వ్యక్తం చేశారు. గావస్కర్‌ ఆడుతున్న జిడ్డు ఇన్నింగ్స్ చూడలేక స్టేడియానికి వచ్చిన ఓ క్రికెట్ అభిమాని.. తన లంచ్ బాక్స్‌ని గ్రౌండ్‌లోకి విసిరేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత చాలామంది అభిమానులు గవాస్కర్ వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశారంటే పరిస్థితి ఎంతవరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.ఈ మ్యాచ్‌లో సునీల్ గవాస్కర్ కొట్టింది ఒకే ఒక్క ఫోర్ మాత్రమే, స్ట్రైయిక్ రేటు 20.69... 60 ఓవర్లలో దాదాపు సగం ఓవర్లు ఆడేసిన సునీల్ గవాస్కర్, సింగిల్స్ తీయడానికి కూడా తెగ ఇబ్బందిపడడంతో స్కోరు బోర్డు ముందుకు సాగలేదు. దీంతో 60 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేసింది. చేతిలో 7 వికెట్లు ఉన్నప్పటికి 202 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడి విమర్శలు మూటగట్టుకుంది.


అయితే జిడ్డు ఇన్నింగ్స్‌ ఆడడం వెనుక సునీల్‌ గావస్కర్‌ ఒక సందర్బంలో స్పందించాడు. ''1975లో జరిగిన మొదటి వరల్డ్‌ కప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో నేను ఆడిన ఇన్నింగ్స్‌ తలుచుకుంటే ఇప్పటికీ ఏదోలా అనిపిస్తుంది.ఎందుకంటే ఆ రోజు ఏం జరుగుతుందో నాకే అర్థం కాలేదు. ఎంత ప్రయత్నించినా పరుగులు చేయలేకపోయాను. ఔట్‌ అవుదామని కూడా ప్రయత్నించాను. స్టంప్‌కి దూరంగా జరిగాను. కానీ ఏదీ కలిసి రాలేదు... బహుశా నా జిడ్డు బ్యాటింగ్ చూసి అవుట్ చేయకూడదని ఇంగ్లండ్‌ బౌలర్లు అనుకొని ఉంటారు. అందుకే ఆ జిడ్డు ఇన్నింగ్స్‌లోనూ నాటౌట్‌గా మిగిలాను'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక సునీల్‌ గావస్కర్‌ టీమిండియా తరుపున 108 వన్డేల్లో  3092 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 125 టెస్టు మ్యాచ్‌ల్లో 10,122 పరుగులు చేసిన గావస్కర్‌ ఖాతాలో 34 సెంచరీలు, 45 అర్థసెంచరీలు ఉన్నాయి.

చదవండి: Marcus Stoinis: కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌.. ఆ ఒక్క సెంచరీ వెనుక విషాద కథ

Lagaan Goli Bowling Version: మలింగ, బుమ్రాను మించిపోయాడు.. ఎవరీ 'గోలీ' క్రికెటర్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top