నేటి నుంచి పరుగుల పండుగ | 18th Season Of Indian Premier League 2025 Begins Today, Know More Details Of This IPL, Winners List And Matches Schedule | Sakshi
Sakshi News home page

IPL 2025 Starting Today: నేటి నుంచి పరుగుల పండుగ

Published Sat, Mar 22 2025 3:48 AM | Last Updated on Sat, Mar 22 2025 1:26 PM

18th season of Indian Premier League begins today

ఐపీఎల్‌ 18వ సీజన్‌కు రంగం సిద్ధం

తొలి పోరులో నేడు 

బెంగళూరుతో కోల్‌కతా ఢీ

10 జట్లతో మొత్తం 73 మ్యాచ్‌లు

మే 25న ఫైనల్‌ పోరు

2008 మండు వేసవిలో ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ తలపడ్డాయి. ఈ మొదటి పోరులో మెకల్లమ్‌ తన మెరుపు బ్యాటింగ్‌తో అగ్గి పుట్టించాడు. 73 బంతుల్లోనే 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 158 పరుగులు చేసి అతను అంటించిన మంట ఆ తర్వాత అంతకంతా పెరిగి దావానంలా మారి అన్ని వైపులకు వ్యాపించిపోయింది. టి20 క్రికెట్‌లో ఉండే బ్యాటింగ్‌ ధమాకా ఏమిటో అందరికీ చూపించేసింది. ఐపీఎల్‌ అంటే క్రికెట్‌ మాత్రమే కాదని... అంతకు మించిన వినోదమని సగటు అభిమాని ఆటతో పాటు ఊగిపోయేలా చేసింది ఈ లీగ్‌. 

ఐపీఎల్‌లో 17 సీజన్లు ముగిసిపోయాయి. ఇన్నేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. లీగ్‌లో ఆటగాళ్లు మారగా, కొన్ని నిబంధనలూ మారాయి. దిగ్గజాలు స్వల్పకాలం పాటు తామూ ఓ చేయి వేసి తప్పుకోగా, తర్వాతి తరం ఆటను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆటలో ఎన్ని మార్పులు వచి్చనా మారనిది లీగ్‌పై అభిమానం మాత్రమే. ఇన్ని సీజన్లలో కలిపి 1030 మ్యాచ్‌లు జరిగినా ఇప్పటికీ అదే ఉత్సాహం. అంతర్జాతీయ మ్యాచ్‌కంటే వేగంగా సీట్లు నిండిపోతుండగా, ఆటగాళ్ల రాక సినిమా ట్రైలర్‌లా కనిపిస్తోంది. ఇలాంటి వీరాభిమానం మధ్య ఐపీఎల్‌ 18వ పడిలోకి అడుగు పెడుతోంది.   

కోల్‌కతా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌–2025కు రంగం సిద్ధమైంది. నేడు మొదలు కానున్న 18వ సీజన్‌ 65 రోజుల పాటు జోరుగా సాగనుంది. ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో శనివారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడుతుంది. 2008 తర్వాత ఇరు జట్ల మధ్య సీజన్‌ తొలి మ్యాచ్‌ జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 69 లీగ్‌ మ్యాచ్‌లు, ఆపై 4 ‘ప్లే ఆఫ్స్‌’ సమరాల తర్వాత మే 25న ఇదే మైదానంలో జరిగే ఫైనల్‌ పోరుతో టోర్నీ ముగుస్తుంది. 

గత మూడు సీజన్ల తరహాలోనే ఇప్పుడు కూడా 10 జట్లు టైటిల్‌ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. మొదటి మ్యాచ్‌కు వాన అంతరాయం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రేయా ఘోషాల్, కరణ్‌ ఔజ్‌లా, దిశా పటాని ఆట, పాటలతో కూడిన ప్రత్యేక ప్రారంబోత్సవ కార్యక్రమం కూడా జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ప్రేమించే లీగ్‌ మళ్లీ వచ్చిన నేపథ్యంలో టోర్నీకి సంబంధించిన పలు విశేషాలు... 

300 దాటతారా! 
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు టీమ్‌ అత్యధిక స్కోరు 287 పరుగులు. గత ఏడాది బెంగళూరుపై సన్‌రైజర్స్‌ ఈ స్కోరు సాధించింది. ఐపీఎల్‌లో మొత్తం 250కు పైగా స్కోరు10 సార్లు నమోదైతే ఇందులో ఎనిమిది 2024లోనే వచ్చాయి. కొత్త సీజన్‌లో ఇలాంటి మరిన్ని మెరుపు ప్రదర్శనలు రావచ్చని అంతా భావిస్తున్నారు. బ్యాటర్లు జోరు సాగితే తొలిసారి లీగ్‌లో 300 స్కోరు కూడా దాటవచ్చు.

2008 నుంచి 2025 వరకు... 
ఐపీఎల్‌ తొలి సీజన్‌లో జట్టుతో ఉండి ఈసారి 18వ సీజన్‌లో కూడా బరిలోకి దిగబోయే ఆటగాళ్లు 9 మంది ఉండటం విశేషం. ధోని, కోహ్లి, రోహిత్, మనీశ్‌ పాండే, రహానే, అశ్విన్, జడేజా, ఇషాంత్‌ శర్మ, స్వప్నిల్‌ సింగ్‌ ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో కోహ్లి ఒక్కడే ఒకే ఒక జట్టు తరఫున కొనసాగుతున్నాడు. 

ఇందులో 34 ఏళ్ల లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ స్వప్నిల్‌ సింగ్‌ ప్రస్థానం భిన్నం. 2008లో ముంబై టీమ్‌తో ఉన్నా... 2016లో పంజాబ్‌ తరఫున తొలి మ్యాచ్‌ ఆడే అవకాశం వచ్చింది. మొత్తంగా 5 సీజన్లే అవకాశం దక్కించుకున్న అతను 14 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు.  

రోహిత్, కోహ్లి మళ్లీ టి20ల్లో... 
గత ఏడాది టి20 వరల్డ్‌ కప్‌ విజయం తర్వాత ఈ ఫార్మాట్‌కు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి రిటైర్మెంట్‌ పలికారు. ఇప్పుడు వారి టి20 ఆటను చూసే అవకాశం మళ్లీ ఐపీఎల్‌లోనే కలగనుంది.

ఆ ఒక్కటీ అడక్కు! 
ఐపీఎల్‌ రాగానే ఎమ్మెస్‌ ధోనికి ఇదే ఆఖరి సీజనా అనే చర్చ మళ్లీ మొదలవుతుంది! గత నాలుగేళ్లుగా అతను ‘డెఫినెట్‌లీ నాట్‌’ అంటూ చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నాడు. లీగ్‌లో బ్యాటర్‌గా ధోని ప్రభావం దాదాపు సున్నాగా మారిపోయింది. అతని స్థాయి ఆట ఎంతో కాలంగా అస్సలు కనిపించడం లేదు. తప్పనిసరి అయితే తప్ప బ్యాటింగ్‌కు రాకుండా బౌలర్లను ముందుగా పంపిస్తున్నాడు. 

ఒక రకంగా టీమ్‌ 10 మందితోనే ఆడుతోంది! అయితే చెన్నై సూపర్‌ కింగ్స్‌ మేనేజ్‌మెంట్‌ ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఆటగాడిగా ఎలా ఉన్నా అతను మైదానంలో ఉంటే చాలు అని వారు భావిస్తున్నారు. అధికారికంగా కెప్టెన్  కాకపోయినా జట్టును నడిపించడంలో, వ్యూహాల్లో, టీమ్‌కు పెద్ద దిక్కుగా అతనికి అతనే సాటి. ఫిట్‌గానే ఉన్నాడు కాబట్టి అతను తనకు నచ్చినంత కాలం ఆడతాడేమో.

2025 లీగ్‌ వివరాలు
»  మొత్తం 13 వేదికల్లో టోర్నీ జరుగుతుంది. 7 టీమ్‌లకు ఒకే ఒక హోం గ్రౌండ్‌ ఉండగా... 3 జట్లు రెండు వేదికలను హోం గ్రౌండ్‌లుగా ఎంచుకున్నాయి. ఢిల్లీ తమ మ్యాచ్‌లను ఢిల్లీతోపాటు విశాఖపట్నంలో, పంజాబ్‌ తమ మ్యాచ్‌లను ముల్లన్‌పూర్‌తో పాటు ధర్మశాలలో, రాజస్తాన్‌ తమ మ్యాచ్‌లను జైపూర్‌తో పాటు గువాహటిలో ఆడుతుంది.  

»  ఐపీఎల్‌ ప్రదర్శనను బట్టే 10 టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌ ‘ఎ’లో చెన్నై, కోల్‌కతా, రాజస్తాన్, బెంగళూరు, పంజాబ్‌ ఉండగా... గ్రూప్‌ ‘బి’లో ముంబై, హైదరాబాద్, గుజరాత్, ఢిల్లీ, లక్నో ఉన్నాయి. ప్రతీ టీమ్‌ తమ గ్రూప్‌లోని మిగతా 4 జట్లతో రెండు మ్యాచ్‌ల చొప్పున (8 మ్యాచ్‌లు), మరో గ్రూప్‌లో ఒక జట్టుతో రెండు మ్యాచ్‌లు (2), మిగతా నాలుగు టీమ్‌లతో ఒక్కో మ్యాచ్‌ (4) ఆడతాయి. అందరికీ సమానంగా 14 మ్యాచ్‌లు వస్తాయి. వీటిలో 7 సొంత గ్రౌండ్‌లలో ఆడతాయి. 

» కొత్త సీజన్‌లో కొన్ని మార్పులు కూడా వచ్చాయి. బంతిని షైన్‌ చేసేందుకు ఉమ్మి (సలైవా)ను వాడేందుకు అనుమతినిచ్చారు. హైట్‌కు సంబంధించిన వైడ్‌లు, ఆఫ్‌ సైడ్‌ వైడ్‌లను తేల్చేందుకు కూడా డీఆర్‌ఎస్‌ సమయంలో ‘హాక్‌ ఐ’ ని ఉపయోగిస్తారు. స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేస్తే కెప్టెన్లపై జరిమానా వేయడాన్ని, సస్పెన్షన్‌ విధించడాన్ని తొలగించారు. దానికి బదులుగా డీ మెరిట్‌ పాయింట్లు విధిస్తారు. 

రాత్రి మ్యాచ్‌లలో మంచు ప్రభావం ఉందని భావిస్తే రెండో ఇన్నింగ్స్‌ సమయంలో 10 ఓవర్ల తర్వాత ఒక బంతిని మార్చేందుకు అవకాశం ఇస్తారు. ఇప్పటి వరకు బంతి దెబ్బ తిందని భావించి మార్చే విచక్షణాధికారం అంపైర్లకే ఉండేది. అయితే ఇప్పుడు ఫీల్డింగ్‌ కెపె్టన్‌ బంతి మార్చమని కోరవచ్చు.  

»  అన్ని మ్యాచ్‌లు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మొదలవుతాయి. మొత్తం షెడ్యూల్‌లో 12 రోజులు మాత్రం ఒకే రోజు రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. అప్పుడు తొలి మ్యాచ్‌ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది.

» గత ఏడాదితో పోలిస్తే ఐదు టీమ్‌లు కొత్త కెపె్టన్లతో బరిలోకి దిగుతున్నాయి. అక్షర్‌ పటేల్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌), రిషభ్‌ పంత్‌ (లక్నో సూపర్‌ జెయింట్స్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (పంజాబ్‌ కింగ్స్‌), అజింక్య రహానే (కోల్‌కతా నైట్‌రైడర్స్‌), రజత్‌ పాటీదార్‌ (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు) ఆయా టీమ్‌లకు తొలిసారి సారథులుగా వ్యవహరించనున్నారు. 

నిషేధం కారణంగా ముంబై తొలి మ్యాచ్‌కు పాండ్యా స్థానంలో సూర్యకుమార్‌... గాయం నుంచి సామ్సన్‌ కోలుకోకపోవడంతో రాజస్తాన్‌ రాయల్స్‌ తొలి మూడు మ్యాచ్‌లకు రియాన్‌ పరాగ్‌కెప్టెన్లుగా మైదానంలోకి దిగుతారు. వేలంలో రూ. 27 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించిన రిషభ్‌ పంత్‌పై ఇప్పుడు ఆటగాడిగా, కెప్టెన్‌గా అందరి దృష్టీ ఉంది.

ఐపీఎల్‌ విజేతలు (2008 నుంచి 2024 వరకు)
2008 రాజస్తాన్‌ రాయల్స్‌ 
2009 డెక్కన్‌ చార్జర్స్‌ 
2010 చెన్నై సూపర్‌ కింగ్స్‌ 
2011 చెన్నై సూపర్‌ కింగ్స్‌ 
2012 కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 
2013 ముంబై ఇండియన్స్‌ 
2014 కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 
2015 ముంబై ఇండియన్స్‌ 
2016 సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 
2017 ముంబై ఇండియన్స్‌ 
2018 చెన్నై సూపర్‌ కింగ్స్‌ 
2019 ముంబై ఇండియన్స్‌ 
2020 ముంబై ఇండియన్స్‌ 
2021 చెన్నై సూపర్‌ కింగ్స్‌ 
2022 గుజరాత్‌ టైటాన్స్‌ 
2023 చెన్నై సూపర్‌ కింగ్స్‌ 
2024 కోల్‌కతా నైట్‌రైడర్స్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement