కల్తీ మిఠాయి..
నెయ్యి నుంచి రంగుల దాకా... నాణ్యతకు తిలోదకాలు!
● దూద్ పేడాలో స్టార్చ్ గుర్తింపు
● ఆకర్షణీయ రంగుల వెనుక రసాయనాలు?
● నెలకు సగటున పది శాంపిల్స్ మాత్రమే సేకరణ
● తనిఖీలు అంతంతే.. వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పు
సాక్షి, సిద్దిపేట: స్వీట్‌హౌస్‌లో అడుగుపెడితే చాలు.. అద్దాల షో కేసుల్లో రంగురంగుల మిఠాయిలు నోరూరిస్తాయి. పసుపు, ఎరుపు,ఆరెంజ్, ఆకుపచ్చ రంగుల్లో మెరిసిపోయే స్వీట్లు కొనుగోలుదారులను ఆకర్షిస్తాయి. కాజు కట్లీ నుంచి మైసూర్‌పాక్ వరకు..దూద్ పేడా నుంచి లడ్డూల వరకు రకరకాల మిఠాయిలు అందుబాటులో ఉంటాయి. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలవేళ వీటి అమ్మకాలు మరింత పెరుగుతాయి. అయితే ఈ మిఠాయిల తయారీలో వినియోగిస్తున్న పదార్థాల నాణ్యత ఎంత? అసలైన నెయ్యే వాడుతున్నారా? ఆకర్షణీయంగా కనిపించేందుకు అనుమతిలేని రంగులు కలుపుతున్నారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా రెండు స్వీట్‌హౌస్‌లో విక్రయిస్తున్న దూద్ పేడా, స్వీట్లలో వినియోగిస్తున్న నెయ్యి నమూనాలు ఆహార భద్రతాధికారులు సేకరించగా దూద్ పేడాలో స్టార్చ్ ఉన్నట్లు, నెయ్యిలో కల్తీ ఉన్నట్లు ప్రయోగశాల పరీక్షల్లో తేలింది.
పాలలో తయారయ్యే పేడాలో పిండి పదార్థం!
దూద్ పేడా అంటే పాలతో తయారుచేసే మిఠాయి. ఇందులో అదనపు స్టార్చ్(పిండి పదార్థం) ఉండకూడదు. అయితే స్వీట్‌హౌస్‌లో విక్రయిస్తున్న దూద్ పేడా నమూనాను ప్రయోగశాలకు పంపించి పరీక్షించగా స్టార్చ్ ఉన్నట్లు వెల్లడైంది. ఇటీవల గజ్వేల్‌లోని బాలాజీ స్వీట్ హౌస్, సిద్దిపేట పట్టణంలో కొత్త బస్టాండ్ సమీపంలోని గణేశ్ స్వీట్‌హౌస్‌లో దూద్ పేడా నమూనాలను సేకరించారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిర్దేశించిన పరీక్షా పద్ధతుల ప్రకారం నిర్వహించిన పరీక్షలో స్టార్చ్ ఫలితం పాజిటివ్‌గా వచ్చింది. నిర్దేశిత ప్రమాణాలకు విరుద్ధంగా అదనపు స్టార్చ్ ఉన్నందున నమూనాను నాసిరకం (సబ్‌స్టాండర్డ్)గా పరిగణించారు. అలాగే పాల పదార్థాలతో తయారు చేసిన తినుబండరాలు రెండు నుంచి మూడు రోజులు మాత్రమే నిల్వ పెట్టాలి. కానీ స్వీట్ హౌస్‌లలో రోజుల తరబడి నిల్వలు ఉంచుతూ విక్రయిస్తున్నారు.
నెయ్యి పేరుతో ఏం వాడుతున్నారు?
మిఠాయిల తయారీలో నెయ్యి వినియోగం కీలకం. నాణ్యమైన నెయ్యి వాడితేనే రుచి, సువాసన, నాణ్యత ఉంటాయి. అయితే నెయ్యి ధరలు అధికంగా ఉండటంతో కొందరు తయారీదారులు ఖర్చు తగ్గించుకునేందుకు చౌకై న కొవ్వు పదార్థాలను ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సిద్దిపేట పట్టణంలో మహవీర్ స్వీట్ హౌస్‌లో నెయ్యి నమూనాలను సేకరించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం ఈ నెయ్యిలో రీచర్ట్ మీసల్ విలువ కనీసం 24 ఉండాల్సి ఉండగా 23.35గా నమోదైంది. మరోవైపు బ్యూటిరో రిఫ్రాక్టోమీటర్ రీడింగ్ 40 నుంచి 43 మధ్య ఉండాల్సి ఉండగా 43.98గా వచ్చింది. ఈ రెండు ఫలితాలు నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్ధారించారు.
ఆకర్షణీయ రంగుల వెనుక రసాయనాలు?
స్వీట్లకు రంగులు అద్దడం ద్వారా వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. అయితే ఆహార పదార్థాల్లో వినియోగించేందుకు అనుమతించిన రంగులను మాత్రమే నిర్ణీత పరిమితుల్లో ఉపయోగించాలి. కొన్నిచోట్ల అనుమతి లేని సింథటిక్ రంగులు, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే రసాయనాలను మిఠాయిల్లో కలుపుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని గుర్తించేందుకు రంగులు అధికంగా కనిపించే స్వీట్ల నమూనాలను సేకరించి పరీక్షించాల్సిన అవసరం ఉంది. అలాగే స్వీట్లు తయారు చేసే సమయంలో తయారు చేసేవారు తలకు, ముక్కుకు ఎలాంటి రక్షణ లేకుండానే చేస్తున్నారు. అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం లేదు.
నెలకు సగటున పది శాంపిల్స్ మాత్రమే సేకరణ?
ఫుడ్ సేఫ్టీ అధికారులు నెలకు సగటున పది చొప్పున మాత్రమే శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపిస్తున్నారు. అందులో సబ్‌స్టాండర్డ్స్ వస్తున్నా తనిఖీలు పెంచడం లేదు. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 126 శాంపిల్స్ సేకరించగా అందులో 25 సబ్ స్టాండర్డ్స్ వచ్చాయి. ముఖ్యంగా పండుగల సమయంలో స్వీట్ల విక్రయాలు పెరిగే నేపథ్యంలో ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టాలి. కేవలం దూద్ పేడాతో సరిపెట్టకుండా మిగతా స్వీట్లను సైతం టెస్ట్ చేయాలని, తనిఖీలు విస్తృతంగా చేస్తేనే ఆహార కల్తీని నిరోధించే అవకాశం ఉంటుందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.
అన్ని స్వీట్ హౌస్‌లకు
ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు
జిల్లాలో అన్ని స్వీట్ హౌస్‌లకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులను జారీ చేశాం. స్వీట్లు తయారు చేసే ప్రాంతం పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా తయారు చేయాలి. త్వరలో రైడ్స్ చేస్తాం. ఆహార పదార్థాల్లో కల్తీ జరిగినట్లు అనుమానం ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలి.
–అమృత శ్రీ, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్


