ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన సాగుతోందని, రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ విమర్శించారు. న్యాయం కోసం గజ్వేల్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన రైతు భీమరి రవి పైన ఎస్సై అకారణంగా దాడి చేయడాన్ని శనివారం ఆయన తీవ్రంగా ఖండించారు. ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. ఇటీవల భూ వివాదం పరిష్కారం కోసం ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చిన రైతుతో ఇంకా బతికే ఉన్నావా...పురుగుల మందు తాగలేదా? అని ఎమ్మార్వో హేళనగా మాట్లాడినా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతాంగం వ్యవసాయం చేయడంలో ఇబ్బంది పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు ఇవ్వకుండా, విద్యుత్ ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ పంటలను ఎండబెట్టి రైతులను నట్టేట ముంచుతుందని విమర్శించారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్


