● సిద్దిపేట పోలీసు కమిషనర్
రష్మీ పెరుమాళ్
● పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు అవగాహన
సిద్దిపేటకమాన్: ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖ నిరంతరం పనిచేస్తుందని సీపీ రష్మీ పెరుమాళ్ పేర్కొన్నారు. పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌లో ‘ఓపెన్ హౌస్’కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..పోలీస్ శాఖ నిర్వహించే విధులు, శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతిక పరిజ్ఞానం ప్రాధాన్యతపై అవగాహన కల్పించామన్నారు. సీసీ కెమెరాల ప్రాధాన్యం, షీటీమ్స్, డాగ్, బాంబు స్క్వాడ్ పనితీరును ప్రత్యక్షంగా విద్యార్థులకు వివరించినట్లు తెలిపారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అత్యవసర పోలీస్ సహాయం కోసం డయల్ 112కు ఫోన్ చేయాలని సూచించారు. పోలీసులు ప్రదర్శించిన పరికరాల పరిశీలనలో విద్యార్థులు అడిగిన సందేహాలను పోలీసులు నివృతి చేశారు.
నేడు మాక్ టెస్ట్
ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల ప్రయోజనార్థం సిద్దిపేట పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉచిత మాక్ టెస్ట్‌ను నిర్వహిస్తున్నట్లు సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ఈ నెల 25న (ఆదివారం) ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉచితంగా పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ విధానంలో ఓఏంఆర్ షీట్ ద్వారా పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.


