● అంగడి వీరన్నగుడి, బురుజు పునరుద్ధరణకు చర్యలు
● హెరిటేజ్ తెలంగాణశాఖ సంచాలకుడు అర్జున్‌రావు
మద్దూరు (హుస్నాబాద్): తెలంగాణ సాయుధ పోరాట చరిత్రకు ప్రతీకగా నిలిచిన బైరాన్‌పల్లిని చారిత్రక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హెరిటేజ్ తెలంగాణశాఖ సంచాలకుడు ప్రొఫెసర్ అర్జున్‌రావు కుతాడి తెలిపారు. గ్రామంలోని చరిత్రాత్మకమైన కట్టడాలు, పురాతన దేవాలయాలను సాంకేతిక బృందంతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ...గ్రామంలో సుమారు 11వ శతాబ్దానికి చెందిన అంగడి వీరన్న గుడి శిథిలావస్థకు చేరడంతో పరిరక్షణ, పునరుద్ధరణ పనులకు ఇంజినీరింగ్ అధికారులు అంచనాలు రూపొందించాలన్నారు. 17– 18వ శతాబ్దాలకు చెందినదిగా భావిస్తున్న చరిత్రాత్మకమైన బురుజు మరమ్మతులకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. భైరవ దేవాలయంలోని పురాతన శిల్పాలను శాసీ్త్రయ పద్ధతిలో భద్రపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బైరాన్‌పల్లి ప్రజల త్యాగాలు, పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేసేందుకు గ్రామంలో ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలు పరిశీలిస్తున్నామని వెల్లడించారు. గ్రామానికి వీర బైరాన్‌పల్లిగా గుర్తింపు కల్పించాలన్న గ్రామస్తుల విజ్ఞప్తిని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ బర్మ రాజమల్లయ్య, హెరిటేజ్ తెలంగాణ ఉపసంచాలకులు పాల్గొన్నారు.


