దుబ్బాకటౌన్: రైతులు విద్యుత్ కష్టాలతో అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని మెదక్ ఎంపీ రఘునందరావు ప్రశ్నించారు. ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో విద్యుత్, సాగునీరు, తాగునీటి సమస్యలు తీవ్రతరమయ్యే అవకాశమున్నందున కార్యాలయాల్లో ఏసీ గదుల్లో సమీక్షలు చేయడంమాని, గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పరస్పర విమర్శలు పక్కనపెట్టి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. శనివారం రాయపోల్ మండలం ఎల్కల్, వడ్డేపల్లి, వీరారెడ్డిపల్లి, వీరానగర్, కొత్తపల్లి, కృష్ణసాగర్, ఆరెపల్లి గ్రామాల్లో పర్యటించిన ఎంపీ సుమారు రూ.1.40 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...దసరాలోపు కొత్త పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, మండల అధ్యక్షుడు మంకిడి స్వామి, ఆయా గ్రామాల సర్పంచులు వెంకటయ్య, రేణుక తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ రఘునందన్‌రావు


