సిద్దిపేటరూరల్: వరి ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు లేకుండా సాఫీగా జరగాలని మండల ప్రత్యేక అధికారి ప్రియాంక స్పష్టం చేశారు. ఎంపిడిఓ మధుసూదన్ అధ్యక్షతన రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన అభివృద్ధి పనుల సమీక్షలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులు వారి శాఖల వారీగా ప్రగతి నివేదికలను వివరించారు. పాఠశాలలో ఎలాంటి సమావేశం, కార్యక్రమాలు జరిగినా సర్పంచులకు ఆహ్వానం ఇవ్వడం లేదని ఎంఈఓను అడిగారు. దీంతో జోక్యం చేసుకున్న మండల ప్రత్యేక అధికారి ప్రియాంక...ఇటీవల రాఘవపూర్ గ్రామంలో జరిగిన మండలస్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడలకు హాజరైన తనకు చేదు అనుభవం ఎదురైందని తనను కనీస గౌరవం లేకుండా సభ వేదికపై ఆహ్వానించలేదని, పేరు కూడా ప్రస్తావించకుండా సభను నడిపిస్తున్న ఓ పీఈటీ వ్యంగ్యంగా మాట్లాడాడని ఆమె కంటతడి పెట్టారు. కార్యక్రమంలో తహసీల్దార్ రెహమాన్, ఇన్‌చార్జి ఎంపీ ఓ రామరాజు, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బట్టు భాస్కర్‌రెడ్డి, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.


