కనెక్షన్‌.. కరప్షన్‌ ! | - | Sakshi
Sakshi News home page

కనెక్షన్‌.. కరప్షన్‌ !

Oct 2 2026 7:32 AM | Updated on Oct 2 2026 7:32 AM

ఇష్టానుసారంగా గృహావసర సర్వీసులు ఇళ్లకు, కనెక్షన్లకు పొంతనలేని వైనం సిబ్బంది చేతివాటమే కారణం! గుర్తించినా చర్యలు శూన్యం

గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో కొత్తగా విలీనమైన గ్రామాలతో కలుపుకొని 12,981ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ ఇళ్ల సంఖ్యతో పొంతన లేకుండా గృహావసర కనెక్షన్లు 22,533, మరో 4,713 కమర్షియల్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో తక్కువలో తక్కువగా వెయ్యికిపైగా అక్రమ కనెక్షన్లు ఉన్నట్లు అధికారులు ఇటీవల గుర్తించినట్లు తెలిసింది. కానీ చర్యలకు మీనమేషాలు లెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

సిద్దిపేట మున్సిపాలిటీలోనూ ఇళ్ల సంఖ్యతో పొంతన లేకుండా 60,527 గృహావసర కనెక్షన్లు, మరో 10,529 కమర్షియల్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇక్కడ సుమారుగా 5వేలపైచిలుకు అక్రమ కనెక్షన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు వినికిడి. కానీ చర్యలకు వెనుకంజవేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాల మున్సిపాలిటీల్లోనూ ఇదేరకమైన పరిస్థితి నెలకొంది.

మున్సిపాలిటీల్లో విద్యుత్‌ అక్రమ కనెక్షన్ల ‘దందా’ యథేచ్ఛగా సాగుతోంది. ఉచిత విద్యుత్‌ నేపథ్యంలో ఈ వ్యవహారం ఊపందుకుంది. ఒకే ఇంటికి రెండు లేదా అంతుకు

మించి కనెక్షన్లు తీసుకోవడం ద్వారా.. ఒకదానికి బిల్లు చెల్లిస్తూ మరొక కనెక్షన్‌కు ఉచిత రాయితీ పొందుతున్నారు. విద్యుత్‌ శాఖ సిబ్బంది కనుసన్నల్లోనే ఈ అక్రమ దందా సాగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి పరిశీలనలో అనేక విషయాలు వెలుగుచూశాయి. – గజ్వేల్‌

జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌, దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా పట్టణాల్లో ఇళ్లకు రెండు, మూడు అంతకంటే ఎక్కువగా విద్యుత్‌ కనెక్షన్లు ఉండటం చర్చనీయాంశంగా మారుతోంది. గృహావసరాలకు 200యూనిట్ల లోపు విద్యుత్‌ వినియోగం ఉచితంగా ఉండటంతో ఈ అక్రమ కనెక్షన్ల ‘దందా’ జోరందుకుంది. గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో విద్యుత్‌ వినియోగం ఎక్కువ. 200 యూనిట్ల లోపు వినియోగించి ఉచిత విద్యుత్‌ రాయితీ పొందడం ఎట్టిపరిస్థితుల్లో సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే ఒకే ఇంటికి రెండు నుంచి ఆపైన కనెక్షన్లు తీసుకొని ఒక కనెక్షన్‌ను తక్కువగా వినియోగించుకొని రాయితీని పొందుతున్నారు. ఈ పరిస్థితి వల్ల ప్రతి నెలా విద్యుత్‌ సంస్థ ఆదాయానికి రూ.లక్షల్లో గండిపడుతోంది.

గుర్తించినా చర్యలు శూన్యం

మున్సిపాలిటీల్లో అక్రమ కనెక్షన్ల బాగోతాన్ని విద్యుత్‌ శాఖ కొంతకాలం క్రితమే గుర్తించింది. కానీ దీనిని సరిచేయడానికి పూనుకోవడం లేదు. తమ సంస్థ ఆదాయానికి గండి పడుతోందని తెలిసినా.. సంబంధిత అధికారులు పట్టనట్లుగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమ కనెక్షన్ల ఏరివేతకు స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించాలని భావించిన అధికారులు షెడ్యూల్‌ కూడా ఖరారు చేశారు. కానీ ఈ విషయంలో ముందడుగు వేయలేకపోయారు. అమ్యామ్యాలవల్లే ఈ పరిస్థితి నెలకొన్నదనే విమర్శలొస్తున్నారు. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిగితేనే వాస్తవాలు బయటపడే అవకాశమున్నది.

మున్సిపాలిటీల్లో ‘విద్యుత్‌’ దందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement