కాంగ్రెస్‌ మోసాలను ఎండగడతాం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ మోసాలను ఎండగడతాం

Oct 2 2026 7:32 AM | Updated on Oct 2 2026 7:32 AM

హామీల అమలు కోసం పోరాడుతాం ‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌’ ఎత్తివేసే కుట్ర మాజీ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేటజోన్‌: హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను, కల్లబొల్లి మాటల మోసాలపై ప్రజలను చైతన్యం చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. గురువారం ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ అనుబంధ సంఘాలైన విద్యార్థి, కార్మిక విభాగాలతో సమీక్ష నిర్వహించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. గతంలో వైఎస్సార్‌ హయాంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్‌ హయాంలో ఈ పథకాన్ని అమలు చేసి రూ.19,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌ నిధులను విడుదల చేస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడేళ్లలో సుమారు రూ.500కోట్లే విడుదల చేసిందని విమర్శించారు. యువ వికాసం పేరిట ప్రతి విద్యార్థికి రూ.5లక్షల చొప్పున విద్య భరోసా కార్డు ఇస్తామని ప్రకటించి పథకాన్ని మరుగున పడేలా చేశారని విమర్శించారు. పెండింగ్‌ బకాయిలు వెంటనే చెల్లిస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం చెప్పిన మాటలు గాలిమాటలు అయ్యాయన్నారు. కాంగ్రెస్‌ పాలనలో సంక్షేమ హాస్టళ్లు, డిగ్రీ కళాశాలలకు తాళాలు పడ్డాయన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ ను ప్రభుత్వం అటకెక్కించిందని, మెగా డీఎస్పీ దగా అయిందని ఆరోపించారు. ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీ అమలులో విఫలమైందన్నారు. కార్మిక సమస్యలపై సంఘటితంగా పోరాటం చేయాలని సూచించారు. అనుబంధ విద్యార్థి, కార్మిక సంఘాల బలోపేతానికి కృషి చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్స్‌. సీనియర్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement