టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్‌ఏ) పరీక్షల పేపర్లను బాహ్య మూల్యాంకనం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట అర్బన్ మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం సభ్యత్వ నమోదు, సమస్యల సేకరణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాల, గాడి చర్లపల్లి, ఇమామ్‌బాద్, లింగారెడ్డిపల్లి, కేసీఆర్ నగర్, రంగథాంపల్లి, తదితర పాఠశాలల్లో టీపీటీఎఫ్ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత, అశాసీ్త్రయ విధానం వల్ల పాఠశాలల్లో విద్యా ప్రతికూల వాతావరణం నెలకొంటుందన్నారు. 33,000 ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మూలంగా పాఠశాలల్లో బోధనా వ్యవస్థకు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. మండల వనరుల కేంద్రంలో పేపర్ మూల్యాంకనం చేసేందుకు సౌకర్యాలు లేవన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, అనిల్‌కుమార్, తిరుపతి, మల్లేశం, వెంకటరమణ, శ్రీదేవి, శ్రీనివాస్, రాజ మోహన్ గౌడ్, రాజు, రాజకుమార్, సుజాత, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.


