మిగతా 23 మండలాల విద్యార్థులకు అందని అల్పాహారం జిల్లాలో 901 ప్రభుత్వ పాఠశాలలు.. 62,978 మంది విద్యార్థులు మూడు మండలాల్లో 16,544 మందికే పథకం
నేటి నుంచి హుస్నాబాద్ నియోజకవర్గంలోని మూడు మండలాల్లోనే అల్పాహార పథకం
జిల్లా వ్యాప్తంగా 901 ప్రభుత్వ పాఠశాలల్లో 62,978 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరితోపాటు జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్ కళాశా లల్లో 6,259 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. అయితే ప్రస్తుతం సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం హుస్నా బాద్ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో అమలు కానుండటంతో అక్కడి 16,544 మంది విద్యార్థులకు అల్పాహారం అందనుంది. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన కిచెన్ నుంచి మూడు మండలాలల్లోని పాఠశాలకు సరఫరా చేయనున్నారు. మిగతా మండలాల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థులకు మాత్రం ఈ ప్రయోజనం అందడం లేదు.
ఒకవైపు మూడు మండలాల్లో విద్యార్థులకు పాఠశాలలోనే ఉదయాన్నే అల్పాహారం అందనుండగా.. మరోవైపు మిగతా 23 మండలాల్లోని 52,693 మంది విద్యార్థులు ఇంటి నుంచే అల్పాహారం చేసుకుని రావాల్సిన పరిస్థితి ఉంది. ఉదయం పూట కుటుంబ పరిస్థితులు, పాఠశాల దూరం తదితర కారణాలతో అల్పాహారం చేయకుండానే బడికి వచ్చే విద్యార్థులున్నారు. అలాంటి పిల్లలకు పాఠశాలలోనే అల్పాహారం అందితే ఆకలి తీరడంతోపాటు పాఠాలపై ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు చెబుతున్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో కోహెడ మండలంలోని బస్వాపూర్ చివరి గ్రామం, సిద్దిపేట నియోజకవర్గంలో నంగునూరు మండలంలో బద్దిపడగ చివరి గ్రామం. ఈ రెండు గ్రామాలు దాదాపు మూడు కిలో మీటర్ల దూరంలోనే ఉంటాయి. బస్వాపూర్‌లో పాఠశాలలో 240 మంది విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ నేటి నుంచి అందనుంది. అదే బద్దిపడగ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 188 మంది విద్యార్థులకు అందని పరిస్థితి ఉంది. ఇలా మూడు కిలో మీటర్ల దూరంలోనే బ్రేక్ ఫాస్ట్ అమలు ఒక్కో తీరుగా ఉంది.
‘మంత్రిగారూ.. మాకూ అందించండి’
హుస్నాబాద్ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో పథకం ప్రారంభం కావడంపై అక్కడి విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతుండగా..మిగతా మండలాల విద్యార్థుల్లో మాత్రం అసంతృప్తి వ్యక్తమవుతోంది. ‘‘మంత్రి పొన్నం ప్రభాకర్ గారూ..సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని జిల్లా అంతటా అమలు చేయించండి’’అంటూ విద్యార్థులు వేడుకుంటున్నారు.
ఉదయం పూట ఆకలితో బడికి వెళ్లే విద్యార్థులకు అల్పాహారం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం జిల్లాలో అందరికీ అందని పరిస్థితి నెలకొంది. నేటి నుంచి హుస్నాబాద్ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ఈ పథకం అమలులోకి రానుండగా..మిగతా 23 మండలాల్లోని విద్యార్థులు మాత్రం పథకం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకే జిల్లా.. ఒకే ప్రభుత్వం..ఒకే పథకం..మరి విద్యార్థుల మధ్య ఈ వ్యత్యాసం ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. – సాక్షి, సిద్దిపేట
జిల్లా వ్యాప్తంగా అమలు చేయాలి
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఉచిత అల్పాహారం అందించాలి. హుస్నాబాద్ నియోజకవర్గం ఒకే ప్రాంతానికి పరిమితం కావడం సరికాదు. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల ఆరోగ్యం, ఏకాగ్రత, హాజరును దృష్టిలో పెట్టుకుని పథకాన్ని జిల్లా మొత్తం అమలు చేయాలి.
–గుడికందుల రవి,
యూఎస్‌ఎఫ్‌ఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి


