మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి
కొండపాక(గజ్వేల్): సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పిలుపునిచ్చారు. కుకునూరుపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ...పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత బీఆర్‌ఎస్ హయాంలో పార్టీ నాయకుల కనుసన్నల్లో డబుల్ బెడ్రూంలు ఇళ్లు మంజూరయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అర్హులైన వారందరికీ పార్టీలకతీతంగా ఇందిరమ్మ పథకంలో ఇళ్ల నిర్మాణాలు మంజూరు చేస్తుందన్నారు. అధికారం కోల్పోవడంతో బీఆర్‌ఎస్ నాయకులు మతిభ్రమించి ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు.


