దుబ్బాక చేనేత సహకారసంఘం చైర్మన్ మధు
దుబ్బాక: తరాలుగా నమ్ముకున్న కులవృత్తిపై ఆధారపడ్డ చేనేత కార్మికులందరికీ ప్రభుత్వం ఫించన్లు ఇవ్వాలని దుబ్బాక చేనేత సహకార సంఘం చైర్మన్ అంకం మధు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమానికి దుబ్బాక నుంచి భారీగా చేనేత కార్మికులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చేనేత కార్మికులకు ఫించన్లు ఇవ్వాలని మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్‌ను కోరామన్నారు. మంత్రులు సైతం ఫించన్లు ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించారని తెలిపారు. కార్యక్రమంలో చేనేత సొసైటీ పాలకమండలి సభ్యులు గురుచరణ్,చందు తదితరులున్నారు.
చేనేత కార్మికుల
అభ్యున్నతికి కృషి
సిద్దిపేటజోన్: చేనేత కార్మికుల సంక్షేమం, అభ్యున్నతికి కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి చేసినట్లు తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కొండా లక్ష్మణ్ జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు. అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలని, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో విఠల్, విష్ణు పాల్గొన్నారు.
జీఓ 25 రద్దు చేయాలి
టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ జానకి రాములు
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రాథమిక పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులపై పనిఒత్తిడి పెంచే జీఓ 25ను రద్దు చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ జానకి రాములు డిమాండ్ చేశారు. ఆదివారం నిర్వహించిన టీపీటీఎఫ్ మండల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతీ తరగతికి ఒక టీచర్‌ను కేటాయించాలన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించి తరగతి గదికే అంకితం చేయాలని తెలిపారు.
రూ.1.28 లక్షలు పలికిన గణపతి లడ్డూ
చేర్యాల(సిద్దిపేట): వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గణపతి లడ్డూ వేలంలో లడ్డూను రూ.1,28,101కు కాటం వెంకటేశ్ దక్కించుకున్నారు. స్థానిక ఏపీజీవీబీ బ్యాంక్ సమీపంలో సచిన్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఆదివారం లడ్డూకు నిర్వహించిన వేలంపాటలో భక్తులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొనగా తీవ్ర పోటీ నెలకొంది. చివరకు పట్టణ కేంద్రానికి చెందిన కాటం వెంకటేశ్ తన కుమారుడు కాటం దేవాన్ష్ పేరిట వేలం పాడి లడ్డూ దక్కించుకున్నారు.


